జైపూర్: ఆస్తి వివాదం నేపథ్యంలో వృద్ధులైన అక్కాచెల్లెళ్లను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. (Sisters Kidnapped) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గంట లోపే వారిని కాపాడారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఒక ఇంటికి వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు 70 ఏళ్ల వయస్సున్న రామా జైన్, కుంకుమ్ జైన్లను కిడ్నాప్ చేశారు. వృద్ధులైన అక్కాచెల్లెళ్లను వాహనంలోకి బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే కొందరు తమ మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను పోలీసులకు చూపించారు. దీంతో నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనాన్ని ట్రేస్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన వృద్ధులైన సోదరీమణులను గంటలోనే పోలీసులు రక్షించారు.
మరోవైపు మహ్మద్ ఆదిల్ షేక్, అతడి అనుచరులు తమ పూర్వీకుల ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేశారని ఆ మహిళలు ఆరోపించారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు తమను కొట్టి గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు చెప్పారు. వివాదాస్పద ఆస్తిపై రెండు కోట్లు ఖర్చు చేశానన్న షేక్ తమ నుండి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.