సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) మేఘాలకు చిల్లు పడినట్లు కుండపోతగా (Cloudburst) వర్షాలు కురిశాయి. కుంభవృష్టికి ఆకస్మిక వరదలు (Flash floods) పోటెత్తడంతో.. కొండ ప్రాంతాల్లో నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ఇద్దరు మృతిచెందగా, 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జలవిద్యుత్తు ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. భారీవర్షాల కారణంగా ప్రాజెక్టు పనిని నిలిపివేశారు.
సైంజ్, గడ్సా, సోలాంగ్ నాలా ప్రాంతాల్లో మూడు క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా వరద ప్రవాహ వేగంతోపాటు బియాస్, సట్లెజ్ నదుల్లో నీటిమట్టం అంతకంతకూ పెరగడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నదులు, వాగులు ఉప్పొంగడంతో కుల్లు జిల్లా అంతటా భారీ వరదలు సంభవించాయి. బియాస్ నది ప్రవాహంతో మనాలీ – చండీగఢ్ జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతింది. బంజర్ సబ్‌డివిజనులో ఓ వంతెన కొట్టుకుపోయింది. కుల్లు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని కలిపే కీలక రహదారి అయిన.. ఆట్-లుహ్రీ-సైంజ్ నేషనల్ హైవే మూతపడడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. దాదాపు ఏడు జిల్లాల్లో జూన్ 29 దాకా భారీవానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కుల్లు, హమీర్పూర్, సోలన్, ఉనా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వస్తాయని అంచనా వేసింది.