బఠిండా: పంజాబ్లోని బఠిండా మిలిటరీ స్టేషన్(Bathinda Military Station)లో ఇవాళ ఫైరింగ్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో(firing) నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు చెందిన వివరాలను పంజాబ్ పోలీసులు(Punjab police) వెల్లడించారు. బఠిండా మిలిటరీ స్టేషన్ ఫైరింగ్ ఘటనలో ఉగ్రవాద కోణం లేదన్నారు. బఠిండా ఆర్మీ కంటోన్మెంట్లోని అన్ని గేట్లను మూసివేశారు. రెండు రోజుల క్రితం 28 క్యాట్రిడ్జ్లతో ఉన్న ఓ ఇన్సాస్ రైఫిల్(Insas Rifle) మాయమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఆర్మీ వ్యక్తి ఉండి ఉంటారని భావిస్తున్నారు. కాల్పుల ఘటనను సోదర హత్య(ఫ్రాట్రిసైడల్)గా పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్పీఎస్ పార్మార్ తెలిపారు.
ఎప్పుడు జరిగింది..
ఇవాళ తెల్లవారుజామున 4.35 నిమిషాలకు బఠిండా మిలిటరీ స్టేషన్లో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటన జరగ్గానే స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్లు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హై అలర్ట్ జారీ చేశారు. ఈ కాల్పుల ఘటన గురించి రక్షణశాఖ, ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశారు.
సైనికపరంగా బఠిండా చాలా ముఖ్యమైన మిలిటరీ కేంద్రం. ఇక్కడే 10 కార్ప్స్కు చెందిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇది జైపూర్లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్లో అనేక ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు ఉన్నాయి.
ఆర్టిల్లరీ యూనిట్ సమీపంలో ఉన్న ఆఫీసర్స్ మెస్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఫ్రాట్రిసైడ్ ఘటన అంటున్నారు. ఈ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దర్యాప్తునకు ఆదేశించారు.