కోల్కతా: పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. శనివారం రాత్రి ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను నిర్వహించడానికి వెళ్తున్న మెటాడోర్ వ్యాన్.. రోడ్డు పక్కన ఆపిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో ఆ వాహనంలో 20 మందికి పైగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు, వ్యాన్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.