Murder : ఇన్స్టాగ్రామ్ పోస్టు విషయమై తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్లో అనుచిత పోస్టు ఎందుకు పెట్టావని మందలించిన 16 ఏళ్ల బజరంగ్దళ్ కార్యకర్త (Bajarangdal worker) దారుణహత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని మొరాదాబాద్ (Moradabad) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సూరజ్నగర్ పీతల్ బస్తీకి చెందిన శోభిత్ (16) బజరంగ్దళ్లో క్రీయాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి కాట్ఘర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దేహ్రీ గ్రామంలో ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టు విషయమై గ్రామానికి చెందిన వ్యక్తులతో జరిగిన గొడవ హత్యకు దారితీసింది.
దుండగులు అతడిని సమీపం కాల్చిచంపి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.