శ్రీనగర్/న్యూఢిల్లీ, జూలై 9: జమ్ముకశ్మీర్‌లోని అమర్నాథ్లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన 40 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అమర్నాథ్ నుంచి ఇప్పటి వరకు 15,000 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, విలయంలో మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 16కు పెరిగింది.
అమర్నాథ్లో వరదల బారి నుంచి పలువురిని కాపాడిన రాజస్థాన్‌కి చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారి వీరమరణం పొందారు. ఇతరులను కాపాడిన ఆయన.. ప్రమాదవశాత్తూ ఆ ప్రవాహపు నీటిలో కొట్టుకుపోయారు. సుశీల్ ఖాత్రి తొమ్మిది రోజుల క్రితమే రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్చార్జిగా రిటైర్డ్ అయ్యారు. ఈనెల 3న కుటుంబసభ్యులతో సహా 17 మంది బృందంతో అమర్నాథ్ యాత్రకు వచ్చారు. వరదల ధాటికి గుహా సమీపంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలు కొట్టుకుపోతున్న సమయంలో తమ బృంద సభ్యులతో పాటు పలువురిని ఖాత్రి కాపాడారు. ఈ క్రమం లో ఆయన ప్రమాదవశాత్తూ మరణించారు.
అమర్నాథ్లో చిక్కుకుపోయిన రాష్ర్టానికి చెందిన యాత్రికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెండు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. సాయం కోసం 011-23380556 లేదా 011- 23380558కి కాల్ చేయాలని అధికారులు సూచించారు. మరోవైపు జనగాంకు చెందిన ఒక మహిళతో సహా రాష్ర్టానికి చెందిన నలుగురు అమర్నాథ్లో చిక్కుకుపోయారు. వారిని తాడూరి రమేశ్, సిద్ధ లక్ష్మయ్య, లక్ష్మీనరసయ్య, సత్యనారాయణగా గుర్తించారు. వీరు ఈనెల 3న యాత్రను ప్రారంభించారు. వీరిలో రమేశ్, సత్యనారాయణ సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉన్నది.