కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సిటీలో జికా వైరస్ ( Zika virus ) అంతకంతకే విస్తరిస్తున్నది. రోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ కూడా 13 మందికి జికా వైరస్ సోకింది. దాంతో కాన్పూర్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 79కి చేరింది. జికా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాన్పూర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
కాన్పూర్‌లో జికా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నది. జికా విస్తరణకు సాధ్యమైనంత త్వరగా అడ్డుకట్ట వేయాలి. తక్షణమే అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. పరిస్థితిని సీరియస్‌గా తీసుకుని, ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలి అని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు కాన్పూర్ అంతటా దోమల నిర్మూలన కోసం ఫాగింగ్ చేయిస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లో జికా వైరస్‌కు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.