నోయిడా : సూపర్ మ్యాస్ స్టంట్ చేయబోయి ఓ 12 ఏండ్ల బాలుడు ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడా పరిధిలోని పార్థలా గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మే 14వ తేదీన సుర్జీత్ అనే బాలుడు సూపర్ మ్యాన్ స్టంట్ చేయబోయాడు. ఈ సమయంలో అతని నలుగురు చెల్లెళ్లు అక్కడే ఉన్నారు. అయితే సుర్జీత్ తన మెడకు ఓ గుడ్డ చుట్టుకుని వుడెన్ బాక్స్ నుంచి బయటకు దూకేందుకు ప్రయత్నించాడు. ఈ బట్ట ముక్క బాక్స్ చివరి భాగంలోనే చిక్కుకోవడంతో.. అది మెడకు చుట్టుకుంది.
ఈ దృశ్యాలను తన 11 ఏండ్ల సోదరి మొబైల్ ఫోన్లో చిత్రీకరించింది. అయితే సుర్జీత్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అతని చెల్లెళ్లు అప్రమత్తమై తల్లికి సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని సమీపంలో ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.