Consuming Class | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశంలోని 143 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. అవసరమైన వస్తువులను మించి ఇతర వస్తువుల కొనుగోలుకు డబ్బులు వెచ్చించగలిగే ఆదాయం వీరికి లేదని తెలిపింది. భారతీయుల ఆర్థిక స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. దేశంలో 13 కోట్ల మంది మాత్రమే ‘కన్జ్యూమింగ్ క్లాస్’లో ఉన్నారని తెలిపింది.
కనీస అవసరాలకు మించి ఖర్చు చేయగలిగే ఆదాయం ఉన్న వారిని కన్జ్యూమింగ్ క్లాస్‌గా పేర్కొన్నది. అంకుర సంస్థలకు ఎక్కువగా వీరే మార్కెట్‌గా ఉన్నారని వెల్లడించింది. దేశంలో 30 కోట్ల మందిని ‘ఆశావహ’ వినియోగదారులుగా ఈ నివేదిక పేర్కొన్నది. వీరు ఇప్పుడిప్పుడే అధికంగా ఖర్చు చేయడం ప్రారంభించారని, ఇందుకు డిజిటల్ పేమెంట్ల సదుపాయం దోహదపడుతుందని తెలిపింది. ఎక్కువగా ఓటీటీ, మీడియా, ఎడ్టెక్, రుణ సంస్థలకు వీరు వినియోగదారులుగా ఉన్నారని పేర్కొన్నది.
భారతీయ వినియోగదారుల మార్కెట్ విస్తృతం కావడం లేదని, లోతుగా మారుతున్నదని ఈ నివేదిక ప్రధానంగా పేర్కొన్నది. అంటే, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఇప్పటికే ధనికులుగా ఉన్న వారు మరింత సంపన్నులు అవుతున్నారని వెల్లడించింది. ఎక్కువ జనాభా కోసం కాకుండా ధనికులకు విలాసవంతమైన వస్తువులు విక్రయించడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయని, ఉదాహరణకు ఐదేండ్ల క్రితం 40 శాతంగా ఉన్న అందుబాటు ధరల్లోని గృహాల నిర్మాణం ఇప్పుడు 18 శాతమే ఉందని పేర్కొన్నది. 1990లో దేశంలోని మొదటి 10 శాతం సంపన్నుల వద్ద 34 శాతం జాతీయ ఆదాయం ఉంటే ఇప్పుడు అది 57.7 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఆదాయంలో అట్టడుగున ఉన్న 50 శాతం మంది వాటా.. జాతీయ ఆదాయంలో 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయిందని పేర్కొన్నది.