తిరువనంతపురం: పది మంది వ్యక్తులకు హెచ్ఐవీ సోకింది. (HIV positive) డ్రగ్ వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా హెచ్ఐవీ టెస్ట్ నిర్వహించగా ఇది బయటపడింది. షేరింగ్ డ్రగ్ సిరంజ్ల ద్వారా హెచ్ఐవీ వ్యాపించినట్లు నిర్ధారణ అయ్యింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా కేరళ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యలో వైద్య పరీక్షలు చేశారు. డ్రగ్స్ వినియోగించే వ్యక్తులు, సెక్స్ వర్కర్లతో సహా హై రిస్క్ గ్రూపుల వ్యక్తులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. దీంతో పది మందికి హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
కాగా, షేరింగ్ డ్రగ్ సిరంజ్ల ద్వారా పది మందికి హెచ్ఐవీ సోకినట్లు తెలిసిందని మలప్పురం జిల్లా వైద్యాధికారిణి ఆర్ రేణుక తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కాంటాక్ట్‌లను గుర్తించి టెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. హైఐవీ పాజిటివ్‌గా వచ్చిన వారిలో కొందరు వలస కార్మికులు కూడా ఉన్నారని వెల్లడించారు. డ్రగ్స్ వాడే వారు ఈ వైరస్ బారిన పడటంతోపాటు వారి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.