పాపం పసివాళ్లు

- 10 మంది శిశువులు అగ్నికి ఆహుతి
- మహారాష్ట్రలోని భండారా దవాఖానలో దారుణం
- చనిపోయిన వాళ్లంతా 1-3 నెలల వయసు వాళ్లే
- ఏడుగురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
భండారా, జనవరి 9: ముక్కుపచ్చలారని పసి మొగ్గలు.. ఇంకా కండ్లు కూడా తెరువని నవజాతలు.. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో దవాఖానలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పసిమొగ్గలను అగ్ని కీలలు బలి తీసుకున్నాయి. రాకాసి పొగ మింగేసింది. మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. 1 నుంచి 3 నెలల వయసున్న వీరిలో 8 మంది ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉన్నారు. భండారాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో నవజాత శిశువులకు చికిత్స అందించే వార్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై మెరుపు వేగంతో స్పందించిన సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది.. ఏడుగురు శిశువులను రక్షించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్యూటే కారణమని అనుమానిస్తున్నారు.
ఊపిరాడకనే..
పిల్లల వార్డులో పొగ రావటాన్ని ముందుగా గుర్తించిన ఓ నర్సు.. వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పేలుడు శబ్దం వినిపించినట్టు ఆ సమయంలో డ్యూటీలో ఉన్న శుభాంగి, స్మిత అనే నర్సులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 17 మంది శిశువులు చికిత్స పొందుతుండగా.. ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ, మంటలు, దట్టమైన పొగ అలుముకోవటంతో మిగతావారిని రక్షించలేకపోయారు. అప్పటికీ వైద్య సిబ్బంది, నర్సులు ప్రాణాలకు తెగించి తలుపులు, కిటికీలు తెరిచినా ప్రయోజనం లేకపోయింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కాలిన గాయాలతో చనిపోయారని, ఏడుగురు ఊపిరాడక మరణించినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.
అమ్మానాన్న ఎవరో తెలియకుండానే..
తమ ప్రేమకు ప్రతిరూపాలైన పాలబుగ్గల పసిమొగ్గలు చూస్తుండగానే విగత జీవులుగా మారటంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దవాఖాన పరిసరాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిచెందిన శిశువుల్లో 9 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఒక శిశువు అనాథ కావటంతో దవాఖానలోనే ఉంచారు. ఈ మగ శిశువు వారం క్రితమే భండారా జిల్లా లఖాని తాలూకాలో ఉన్న కేసల్వాడీ అనే మారుమూల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. బాబు ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో భండారా దవాఖానలో చేర్చి కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గీత, విశ్వనాథ్ బెహెరె అనే గిరిజన దంపతుల రెండు నెలల కూతురు 8 రోజుల్లో డిశ్చార్జి కావాల్సి ఉండగా.. ప్రమాదంలో మరణించింది. గతేడాది నవంబర్‌లో తక్కువ బరువుతో జన్మించిన ఈ పాప.. అప్పటి నుంచి భండారా దవాఖానలోనే చికిత్స పొందుతున్నది.
తాజావార్తలు
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'