న్యూఢిల్లీ: ఆర్థికంగా అతలాకుతలమవుతున్న ఇరాన్ మరింత సంక్షోభంలో చిక్కుకుంది. డాలర్ విలువతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రికార్డు స్థాయిలో 13 లక్షలకు పైగా రియాల్స్‌కు పతనమైంది. అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా రెండు వారాల క్రితం డాలర్ విలువతో పోలిస్తే 12 లక్షలకు పతనమైన ఇరాన్ కరెన్సీ సోమవారం నాటికి మరింతంగా దిగజారింది. ఒక డాలర్ విలువ ఇరాన్ కరెన్సీ రియాల్స్‌లో లెక్కిస్తే 13 లక్షల మేర ఉన్నట్లు టెహ్రాన్‌లోని కరెన్సీ వ్యాపారులు తెలిపారు. రియాల్స్ విలువ పతనం కావడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాసోలిన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడం వంటివి ఇరాన్ కరెన్సీ పతనానికి కారణం.