నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్లు చేసిన కాల్పుల వ్యవహారం మరింతగా ముదురుతోంది. ఇన్ని రోజుల పాటు కాల్పులు జరిగిన ప్రదేశం మొన్లోనే తీవ్ర నిరసనలు చెలరేగాయి. పౌర సంఘాలు మాత్రమే నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఏకంగా రాష్ట్ర రాజధాని కోహిమాకు నిరసన సెగలు తగిలాయి. నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ శుక్రవారం కొహిమాలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టింది. వందల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఆర్మీ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని, ఎఫ్ఎస్పీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయకంటే ముందు ఎన్ని సార్లు బుల్లెట్ దెబ్బలు తినాలి? ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయండి.. మా నోళ్లు మూయించడం కాదు అంటూ ప్లకార్డులను చేతబూని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత మూడు రోజులుగా వివిధ సంఘాలు కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూనే ఉన్నాయి. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని నాగా ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.