బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Feb 12, 2020 , 23:47:13

త్వరలో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు

త్వరలో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెప్రగతిని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాల్లో రెండు విడుతల్లో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగింది. పల్లెప్రగతి ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాము సైతం అంటూ కార్యక్రమానికి బాసటగా నిలుస్తున్నారు. దీంతో గ్రామాల స్వరూపమే మారిపోతున్నది. గాంధీజీ కలలుగన్న గ్రామాలు తెలంగాణలో సాకారం అవుతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిస్తోంది. గ్రామాల్లో హరితహారం కార్యక్రమం జోరందుకున్నది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరణ సులువైంది. నర్సరీలను ఏర్పాటు చేయడంతో మొక్కలు నాటేందుకు ఇబ్బందులు తొలగాయి. డంపింగ్‌ యార్డుల ద్వారా చెత్త తరలింపునకు అవకాశం ఏర్పడింది. శ్మశాన వాటికలు నిర్మించారు. పాడుబడ్డ ఇండ్లు, బావుల పూడ్చివేశారు. వేలాడే తీగలు కనిపించడం లేదు. ఇలా ఒక్కటేమిటి అనేక పనులు పూర్తయ్యాయి. దీనికి కారణం పల్లెప్రగతి.   ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా పల్లెప్రగతికి పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు ఏర్పాటు చేసి పల్లెప్రగతిపై సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సమ్మేళనాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25లోపు సమ్మేళనాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

మంత్రుల ఆధ్వర్యంలో..

మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో జరిగే పంచాయతీరాజ్‌ సమ్మేళానాలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరుగుతాయి. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా సమ్మేళనాలు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ సమ్మేళనాలకు సంబంధిత జిల్లా పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌ పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లు హాజరుకావాల్సి ఉంటుంది. పల్లెప్రగతి మరింత వేగవంతం అయ్యేందుకు ఈ సమ్మేళనాలు ఉపయోగపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరి బాధ్యత ఏంటో ఈ సమ్మేళనాల తెలిసే అవకాశం ఉంది. మరోవైపు పల్లెప్రగతిలో చేపట్టాల్సిన మిగతా పనులపైనా ఈ సమ్మేళనంలో వివరించనున్నారు. ఈ నెల 18న మహబూబ్‌నగర్‌ జిల్లా సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. 

VIDEOS

logo