బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 09, 2020 , 03:32:55

ఆత్మసంతృప్తి కోసమే..

ఆత్మసంతృప్తి కోసమే..

  నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ‘చదువంటే నేనెప్పుడూ భయ పడలేదు. ఆడుతూ. పాడుతూ చదివాను. మా నాన్న ఉద్యోగరీత్యా.. నా చదువు తెలుగు రాష్ర్టాలలోని పలు జిల్లాలలో కొనసాగింది. లండన్‌లో నాపీజీ పూర్తి చేశాను.. మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద మొత్తంలో వేతనాలు ఉన్నా వాటిని కాదని ఆత్మసంతృప్తి కోసం ఐఏఎస్‌ కావాలనుకున్నా’ అని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. శనివారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెడుతానని అన్నారు. 

  నమస్తే తెలంగాణ : మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

  కలెక్టర్‌ : మాది ఖమ్మం జిల్లా పండితాపురం. నాన్న శ్రీనివాసులు ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. అమ్మ శైలజ గృహిణి. నాకు ఒక సోదరుడు. నా భర్త ఉన్నత ఉద్యోగి. మాకు ఒకపాప ఉంది.

 మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది?

    పాఠశాల విద్యాభ్యాసం ఖమ్మంలో అనంతరం నాన్న ఉద్యోగరీత్య ఆదిలాబాద్‌, కరీంనగర్‌, సంగారెడ్డి జిల్లాతో పాటు ఆంధ్రాలోని పలు జిల్లాలలో కొనసాగింది. ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లో చదివా. పీజీ (ఎకనామిక్స్‌) లండన్‌లో చదివా.. ఆడుతూ పాడుతూ విద్యాభ్యాసం కొనసాగింది. ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. సమయాన్ని మాత్రం  వృథా చేసేదాన్ని కాదు. 

  ఐఏఎస్‌కు ముందు మీరు ఏవైనా ఉద్యోగాలు చేశారా?

   నా పీజీ పూర్తి అయ్యాక లండన్‌లోని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసా. మంచి ఆఫర్‌ రావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసీ ఓ అంతర్జాతీయ కంపెనీలో పనిచేశా.

  మరి మీ దృష్టి ఐఏఎస్‌ వైపు ఎందుకు మళ్లించారు?  

   పెద్ద మొత్తంలో వేతనాలు వస్తున్న పరిమితులకు లోబడి ఉద్యోగం చేయల్సి ఉండేది. దీనివల్ల చేస్తున్న ఉద్యోగంలో అంతగా ఆనందం ఉండేదికాదు. అందుకే దృష్టి ఐఏఎస్‌ వైపు సారించా. ఎలాగైనా సాధించాలనే సంకల్పంతో చదివి 2010లో ఐఏఎస్‌గా ఎంపికయ్యా

  మీ శిక్షణ పూర్తయ్యాక మొదటగా ఎక్కడ విధులు నిర్వహించారు?

   శిక్షణ పూర్తయ్యాక మొదటగా విజయవాడ సబ్‌ కలెక్టర్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. అనంతరం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఐదేళ్లు పనిచేశా.. ఇప్పుడు బదిలీపై నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా వచ్చా.     

  విధుల నిర్వహణలో మీకు బాగా నచ్చిన కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? 

  జీహెచ్‌ఎంసీలో చాలా కార్యక్రమాలు చేశాం. 200 కోట్లతో దుర్గం చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా రూపొందించాం. మహిళల సాధికారత కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి 1000 మందికి ఉద్యోగావశకాలు కల్పించాం. అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఫీడ్‌ ది నీడ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందరికో కడుపునిండా అన్నం పెట్టాం. ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టాం

  కలెక్టర్‌గా ఈ జిల్లాకు రావడం పట్ల మీ అభిప్రాయం?

  నేను సరైన జిల్లాకే కలెక్టర్‌గా వచ్చాను. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేందుకు పూర్తి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

  జిల్లాలో ప్రధానంగా ఏఏ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు? 

  జిల్లాలో 90 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైననే ఆధారపడి జీవిస్తున్నారు. మూస ధోరణిలో సాగు కొనసాగుతుంది. ఈ రంగంలో మార్పులు తీసుకొస్తాం. బాల్యవివాహాలు, బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక  చర్యలు తీసుకుంటాం. జిల్లాను ప్రగతి పథాన పరుగులు తీయించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తాం.

  జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహించిన అనుభవంతో జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు?

  పల్లెప్రగతి కార్యక్రమంలా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తాం. 

మీ హాబీలు ఏమిటీ?

  నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం, పెయింటింగ్‌ వేయడమంటే చాలా ఇష్టం. సినిమాలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఇప్పటీకీ టీవీ కూడా పెద్దగా చూడను.

VIDEOS

logo