బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 25, 2020 , 00:14:38

మనోళ్లు ఎటు..!

మనోళ్లు ఎటు..!
  • నేడే ఎన్నికల ఫలితాలు
  • ఖర్చును తలుచుకుంటూ బెంబేలు
  • గెలిస్తే ఓకే.. ఓడితే అప్పులపాలే..
  • తేలనున్న భవితవ్యం
  • గెలుపుపై సందిగ్ధంలో అభ్యర్థులు
  • ఖర్చును తలుచుకుంటూ బెంబేలు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల పరిస్థితి గుటుకు.. మిటుకు అన్నచందంగా మారింది. 12 రోజులపాటు ప్రచారంలో బిజీగా గడిపిన, ఎన్నికల్లో ఖర్చు చేసిన అభ్యర్థులు గెలుస్తామా ఓడుతామా అనే సందిగ్ధంలో పడుతున్నారు. ఎన్నికలకు పెట్టిన ఖర్చు తలుచుకుంటూ బెంబేలవుతున్నారు. గెలిస్తే ఖర్చు గుర్తుకు రాదు కానీ ఓటమి పాలైతే అప్పులతోపాటు అపవాదు వచ్చి పడుతుందన్న ఆందోళనలో కొన్ని పార్టీల అభ్యర్థులు అంతర్మథనం చెందుతున్నారు. ప్రత్యర్థుల కంటే తామే ఎక్కువ ఖర్చు పెట్టామని తమదే గెలుపు ఉంటుందని ఒకవైపు భరోసాగా ఉంటున్న ఎన్నికల్లో పెట్టిన ఖర్చు గుర్తుకు వస్తే గుండె గుబేల్ మంటుంది. గెలుస్తామనే ధీమాతోనే పార్టీ టికెట్ కోసం పడరాని పాట్లు పడి టికెట్ తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు గెలుపుభయం పట్టుకున్నది. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాల తరువాతే తమ భవిష్యత్ బయట పడుతుందని పలువురు అభ్యర్థులు అంటున్నారు. ప్రత్యేర్థులకు మాత్రం ధీటుగా ప్రచారం నిర్వహించి ఎన్నికల సంగ్రామంలో దేనికి రాజీ పడకుండా పోరాటం చేశామని విజయం తమనే వరిస్తుందని కొందరు అభ్యర్థులు భావిస్తున్నారు. అభ్యర్థులకు ఎన్నికల కార్యక్రమం ముగియడంతో గెలుస్తామా ఓడుతామో అనే దిగులు పట్టుకున్నది. 


గెలుస్తే ఓకే.. లేదంటే అప్పులే.. 

మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు పెట్టిన వారు ఖర్చును తలుచుకుంటూ ఆందోళనకు గురవుతున్నారు. మిత్రులు, కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా అప్పులు చేసి ఎన్నికల్లో పోటీ చేశాం కానీ గెలిస్తే ఓకే.. లేకుంటే లక్షల్లో అప్పుల్లో కూరుకుపోవడమేనని భావిస్తున్నారు. అప్పులను ఎలా తీర్చాలో అనే సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అప్పులు తీర్చేదెట్లా, గెలుపు వరిస్తేనే అప్పుల ఊబి నుంచి గట్టెకుతామని భావిస్తున్నారు. చేతిలో ఉన్నంత వరకు చేశాం. కానీ గెలుపుపై మాత్రం భయం వీడటం లేదని మరికొందరు అభ్యర్థులు వాపోతున్నారు. కొద్ది రోజులుగా ప్రచారంలో బిజీగా గడిపిన అభ్యర్థులు ఓట్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎవరు సహకరించారు.. ఎవరు చెయ్యి ఇచ్చారు అనే లెక్కల్లో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. 


ఖర్చులు బేరీజు

మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు ఒకవైపు గెలుపుభయం పట్టుకోవడంతోపాటు మరోవైపు ఖర్చులు చేసిన వివరాలను బేరీజు వేసుకుంటున్నారు. బంధుమిత్రులు చెప్పినా వినకుండా ఎన్నికల్లో పోటీచేశామని, ఖర్చుమాత్రం రెట్టింపు అయ్యిందని ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు సహకరించిన వారికి విందులు ఏర్పాటు చేసి ఎవరు చెయ్యిచ్చారు, ఎవరు సహకరించారు, ఎన్ని ఓట్లు వస్తాయి అనే బేరీజులో ఉన్నారు.

VIDEOS

logo