– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
– ప్రతిభావంతులైన విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ ప్రధానం
భూదాన్ పోచంపల్లి, జూలై 20 : విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం పోచంపల్లి మున్సిపాలిటీలోని మీటింగ్ హాల్లో కల్పన ఫౌండేషన్ – త్రివేణి సాహితి సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 32 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు వెండి, కాంస్య పతకాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఏమాత్రం వెనుకబడి లేరని, అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్న కల్పన ఫౌండేషన్, త్రివేణి సాహితి సంఘం నిర్వాహకులను అభినందించారు.
విద్యార్థులు భవిష్యత్లో మరింత కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేష్, వైస్ ఛైర్మన్ కొయ్యడ రజిని–శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య, కల్పనా ఫౌండేషన్ నిర్వాకులు తడక యాదగిరి, పట్నం కృష్ణ కుమార్, తడక లావణ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, కల్పన ఫౌండేషన్ – త్రివేణి సాహితీ సంఘం ప్రతినిధులు గుంటి దయానంద్, రామకృష్ణ పాల్గొన్నారు.

‘పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు’