యాదాద్రి, సెప్టెంబర్ 13 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామివారి నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేళలో స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు.