భువనగిరి కలెక్టరేట్, మే 17 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, మండల విద్యాధికారులు, ఏపీఎంలు, మెప్మా అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి పనులపై ఆయన సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో పనులు చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత ఫొటోలను తీయాలని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల తోడ్పాటుతో పనులు పూర్తి చేయాలని, పాఠశాలల్లో అన్ని వసతులతో రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు స్వాగతం పలుకాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్ కుట్టు పనులు స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, ఏ సంఘంలోనైనా కెపాసిటీకి తగిన పనులు చేయలేకపోతే ఇతర సంఘాలకు అప్పగించాలని, క్షేత్రస్థాయిలో ఏపీఎంలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా కార్యాచరణ ఉండాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ప్రతినెలా 1, 11, 21 తేదీల్లో ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, తాగునీటి అవసరాలకు ఎస్డీఎఫ్, డిపార్టుమెంట్, గ్రామ పంచాయతీ నిధులను వినియోగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, జిల్లా విద్యా శాఖ అధికారి కె.నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి సునంద పాల్గొన్నారు.
గ్రూప్-1 పరీక్షలకు
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతు జెండగే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ కాన్పరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్రతో కలిసి పాల్గొని మాట్లాడారు. టీఎస్పీఎస్సీ గ్రూపు-1 పరీక్ష భువనగిరి పట్టణంలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో (మదర్ థెరిసా హైసూల్, మాంటెస్సోరీ హైసూల్, దివ్యబాల విద్యాలయం, వెన్నెల ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కృష్ణవేణి టాలెంట్ సూల్, భువనగిరి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పెంటగీనగర్లోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీ, పహాడీనగర్లోని నవభారత్ డిగ్రీ, పీజీ కాలేజీ, ఆజాద్ రోడ్లోని సెంటర్ ఏ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3349 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఇందుకోసం ఇద్దరు రూట్ ఆఫీసర్లను, ప్రతి సెంటర్కు ఒక అబ్జర్వర్, రెండు ఫ్లయింగ్ స్వాడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా పర్యవేక్షించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, జిల్లాకు సంబంధించి గ్రూప్-1 పరీక్షల నిర్వహణ రీజినల్ కో ఆర్డినేటర్ హలావత్ బాలాజీ, రాచకొండ ఏసీపీ టి.కరుణాకర్, జిల్లా వైద్యాధికారి పాపారావు, తాసీల్దారు అంజిరెడ్డి, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి రమణి, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.