సూర్యాపేట టౌన్, డిసెంబర్ 09 : ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఎనిమిది మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ప్రచార సమయం ముగిసిందన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత ప్రచారం చేయకూడదన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. ఓటరు వరుస క్రమంలో నిల్చుని ఓటును వినియోగించుకోవాలని, వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు ముందుగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండరాదని, 100 మీటర్ల పరిధిలో ఓటు వేయమని అభ్యర్ధించరాదని, 200 మీటర్ల పరిధిలో టెంట్లు ఏర్పాటు చేయొద్దని, కరపత్రాలు పంచడం, గుర్తులు చూపడం లాంటివి చేయొద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులు పెట్టడం, ప్రలోభాలు గురిచేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిశిత పరిశీలన ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. విజయోత్సవ ర్యాలీలకు, బాణాసంచాకు, డీజేలకు అనుమతి లేదన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘించినట్లైతే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
మొదటి విడుత ఎన్నికలు జరగనున్న మండలాల్లో 15 వందల మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదు అంచెల పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ బూతుల వద్ద, పోలింగ్ లొకేషన్ ల వద్ద, 100 మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధిలో, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎన్నికల నియమావళి అమలు టీమ్స్, రూట్ మొబైల్ సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఆన్లైన్ వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు, కెమెరాలతో ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు.