నల్లగొండ ప్రతినిధి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగుల సచివాలయం ముట్టడి కార్యక్రమంపై పోలీసులు నిర్బంధకాండను అమలు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు సెక్రటేరియట్ వరకూ చేరుకోకుండా ఆదివారం అర్ధరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగించారు. ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదలతోపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ ప్రకటన, ప్రస్తుత డీఎస్సీ, గ్రూప్2 వాయిదా, గ్రూప్-2,3 పోస్టుల పెంపు, గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో ఎంపిక డిమాండ్లతో నిరుద్యోగులు సోమవారం చలో సెక్రటేరిట్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కాగా, కార్యక్రమాన్ని ఫెయిల్ చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
నిరుద్యోగులతోపాటు ఈ పోరాటంలో కీలకంగా ఉన్న యువజన సంఘాల నేతలను, ముఖ్యంగా బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారుజాము వరకే పదుల సంఖ్యలో నేతలు, నిరుద్యోగులను వారి ఇండ్ల వద్దే అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం వరకు విడిచిపెట్టలేదు. హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారులపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టి అనుమానం వచ్చిన అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినా పోలీసుల కండ్లు గప్పి రాజధానికి చేరుకుని చలో సచివాలయం ముట్టడిలో పాల్గొన్నట్లు పలువురు నిరసనకారులు తెలిపారు.
నిరుద్యోగుల సమస్యలపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న యువత, నిరుద్యోగుల అరెస్టును వివిధ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మిర్యాలగూడలో చలో సచివాలయం కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్, సోషల్ మీడియా ఇన్చార్జి వడ్త్యా శివనాయక్తోపాటు పలువురిని టూటౌన్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిర్మలగిరి అశోక్‌తోపాటు పలువురిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
దేవరకొండలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నార్కట్‌పల్లిలో బీఆర్ఎస్వీ నేత బొడిగె భరత్‌గౌడ్, దామరచర్లలో బీఆర్ఎస్వీ నాయకులు వినోద్‌నాయక్, దత్తునాయక్, రాము, బీజేవైఎం నేతలు నిమ్మల విజయ్, కృష్ణంరాజుతోపాటు పలువురి పోలీసులు అరెస్ట్ చేశారు. శాలిగౌరారం, తిర్మలగిరిసాగర్లోనూ బీఆర్ఎస్వీ నేతల అరెస్టులు సాగాయి. త్రిపురారంలో బీజేవైఎం నేతలను, మాడ్గులపల్లిలో డీవైఎఫ్ఐ నాయకులు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ నాయకులు నలపరాజు రమేశ్, ఆడేపు సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోత్కూర్‌లో కంచర్ల కాంత్రికుమార్తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భూదాన్‌పోచంపల్లి, గుండాల, అడ్డగూడూర్లోనూ బీఆర్ఎస్వీ, పలువురు యువజన సంఘాల నేతల అరెస్టులు కొనసాగాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్వీ నేత సోమగాని వేణుగౌడ్తో పాటు పలువురిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాలకీడులో యువజన సంఘం నేత పెరుమాళ్ల సతీశ్ ముందస్తు అరెస్టు చేశారు. నాగారంలో టీఆర్ఎస్వీ నాయకులు, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నడిగూడెం, తుంగతుర్తితో పాటు పలుచోట్ల బీఆర్ఎస్వీ నేతలతోపాటు చలో సచివాలయానికి తరలివెళ్తారన్న అనుమానాలు ఉన్న ప్రతి ఒక్కరినీ ముందుగానే అదుపులోకి తీసుకుని సాయంత్రం వరకు పోలీసు స్టేషన్లలోనే నిర్బంధించారు.