రామగిరి, అక్టోబర్ 5 : ప్రైవేట్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలికంగా చెలించాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ యాజమాన్యాలను బంద్‌కు సిద్ధమయ్యాయి. దసరా సెలవుల తర్వాత కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు విద్యా బోధన సాగించమని స్పష్టం చేశాయి.
అప్పుల ఊబిలో ఉన్న తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని, లేని పక్షంలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ అప్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్(టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవికి శనివారం బంద్ నోటీసును అందజేశారు.
ప్రభుత్వం అందించే ఫీజు రీయంబర్స్మెంట్పైనే ఆధారపడి ప్రైవేట్ కళాశాలల యాజమన్యాలు అర్హత గల విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేస్తున్నాయి. అందుకు అయ్యే ఖర్చులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు భరిస్తూ వస్తున్నాయి. రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో సర్కార్ జాప్యం చేస్తుండడంతో యాజమాన్యాలు అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుములు, బిల్డిండ్ ట్యాక్స్ చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు. అప్పు చేసి అవన్నీ చెల్లిస్తున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కొత్త అప్పులు పుట్టక అధ్యాపకులకు, భవనాల యాజమానులకు సమాధానం చెప్పలేకపోతున్నామని వాపోతున్నారు.
హామీ అమలు చేయని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి రాగానే ప్రైవేట్ కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్ను పూర్తిగా అందచేస్తామని, ప్రతి సంవత్సరం బకాయి లేకుండా ఇస్తామని చెప్పింది. కానీ నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో కళాశాల యాజమాన్యాలు బంద్‌కు సిద్ధమయ్యాయి. ప్రైవేట్ డిగ్రీ, బీఈడీ, ఇతర కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం మేరకు నల్లగొండ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్ మారం నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు శనివారం ఎంజీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు బంద్ నోటీసు అందజేశారు. నోటీసు అందించిన వారిలో టీపీడీపీఎంఏ ఎంజీయూ ప్రధాన కార్యదర్శి ఎం.సైదారావు, కోశాధికారి డి.ప్రవీణ్, గుండెబోయిన జానయ్యయాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు, కార్యవర్గసభ్యులు ఉన్నారు.
పెండింగ్ రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి
ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా తక్షణమే ప్రైవేట్ కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి. రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో అధ్యాపకుల జీతాలు, బిల్డింగ్ అద్దెలు, ప్రభుత్వం, యూన్సివర్సిటీకి చెల్లించే వివిధ రకాల ఫీజులు, టాక్సీలను అప్పులు చేసి చెల్లిస్తున్నాం. కళాశాలల యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎంజీయూ చాప్టర్ ఆధ్వర్యంలో వర్సిటీ రిజిస్ట్రార్‌కు బంద్ నోటీసు అందించాం. సమస్యను పరిష్కరించే వరకు దసరా సెలవుల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఎంజీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీతోపాటు ఇతర కళాశాలలు తెరువకూదని నిర్ణయించాం.
– మారం నాగేందర్‌రెడ్డి, టీపీడీపీఎంఏ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు