నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి03(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క కీలక ప్రాజెక్టునూ ప్రస్తావించలేదు. జిల్లాకు అత్యంత కీలకమైన ఏ ప్రాజెక్టు ఊసూ కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఎంపీలు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. బీబీనగర్- నడికుడి రైల్వే మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రాధాన్యం లభించలేదు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు పత్తాకు లేదు.సికింద్రాబాద్ టు కాజీపేట మూడో లైన్ ప్రస్తావన లేదు. విష్ణుపురం-మోటమర్రి ప్యాసింజర్ రైలు డిమాండ్‌కు చోటు దక్కలేదు. సికింద్రాబాద్- విజయవాడ మధ్య హైస్పీడ్ రైల్వే లైన్ కోసం ఎన్ని వినతులు పెట్టినా
లాభం లేకపోయింది..
ఈ నెల 2న పార్లమెంట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన పింక్ బుక్ వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ముఖ్యంగా రైల్వే పరంగా ఉమ్మడి జిల్లాలో కీలక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండగా.. ప్రతి సంవత్సరం వీటిపై జిల్లా ప్రజలు తమ డిమాండ్లను వినిపిస్తునే ఉన్నారు. జిల్లా మీదుగా ఐదు దశాబ్ధాల కిందట నిర్మించిన బీబీనగర్-నడికుడి రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలని ఏండ్లుగా డిమాండ్ ఉంది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆమోదించినా నిధుల కేటాయింపు దక్కడం లేదు. మొత్తం 248 కిలోమీటర్ల పొడవువైన ఈ మార్గంలో రూ.2480 కోట్ల అంచనాతో డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీనిని పూర్తి చేసేందుకు మాత్రం నిధుల కేటాయింపు అరకొరగానే ఉంటున్నది. ఈ సారి కూడా నామమాత్రంగా 60 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు.
ఇవి ఏ మూలకు సరిపోతాయన్నది సమాధానం లేని ప్రశ్న. ఈ లైన్లో డబ్లింగ్ పూర్తైతే మరిన్ని రైళ్ల రాకపోకలతో పాటు సమయం ఆదా కానుంది. ఇదే రూట్లో 285 కిలోమీటర్ల పొడవైన పగిడిమర్రి- నల్లపాడు మధ్య విద్యుదీకరణ పనులకు రూ.32.8 కోట్లను కేటాయిస్తున్నట్లు తాజా బడ్జెట్లో వెల్లడించారు. ఇది కూడా నామమాత్రం కావడం గమనార్హం. ఈ రెండు మినహా ఇతర ఏ ప్రాజెక్టు కూడా ప్రస్తావనకు నోచుకోలేదు. రెండు తెలుగు రాష్ర్టాల ఏర్పాటు అనంతరం సికింద్రాబాద్- విజయవాడ మార్గంలో 256 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మాణం ముఖ్యమైన డిమాండ్‌గా ఉంది. అయినా దీనిని పట్టించుకోలేదు. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గుండా వెళ్తున్న 65వ నంబర్ జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే ప్రజా, సరుకు రవాణా పరంగా గననీయమైన మార్పులకు ఆస్కారం ఉంది. ఘట్కేసర్ నుంచి రాయిగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు డిమాండ్ ఏండ్ల తరబడి ఉన్నా ఈ సారి కూడా పట్టించుకోలేదు.
సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ మార్గం పొడిగింపు ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ మార్గాన్ని పొడిగించేందుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలోనే రూ.330 కోట్లతో కేంద్రం అమోదం తెలిపినా నిధుల కేటాయింపులు లేవు. దీనికి అదనంగా మరో 73 కోట్లు అవసరమవుతాయని తేల్చి 2020 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్-కాజీపేట రూట్లో ఉన్న డబుల్ లైన్‌కు అదనంగా మరో లైన్‌ను చర్లపల్లి నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రస్తావనకు నోచుకోలేదు. కృష్ణానదీ వెంట ఉన్న సిమెంట్ పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన మోటమర్రి-విష్ణుపురం 90 కిలోమీటర్ల పొడవునా సింగిల్ లైన్ మాత్రమే ఉంది.
దీనిని డబుల్ లైన్‌గా మార్చాల్సి ఉంది. రెండేండ్ల క్రితం జూలైలో కేంద్రం ఆమోదం తెలిపినా ఆచరణకు నోచుకోలేదు. ఈ లైన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు కూడా ఎంతో ఉపయుక్తం కానున్నది. 1997-98లో స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్‌గా మంజూరై మూడుసార్లు సర్వే జరిగిన నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ పనుల ప్రస్తావనేది లేదు. కేంద్రం ఒకటీ రెండుసార్లు నామ మాత్రపు నిధులు మాత్రమే కేటాయించి వదిలేసింది. ఐదారేండ్ల క్రితం 170కిలోమీటర్ల సూర్యాపేట-స్టేషన్‌ఘన్‌పూర్ లైన్ సర్వే నిమిత్తం రూ.25.45లక్షలను కేటాయించిన కేంద్రం తర్వాత పట్టించుకోలేదు.
ఆదాయం ఉన్నా… పట్టింపు లేదు
గుంటూర్ డివిజన్ పరిధిలో ఉన్న మిర్యాలగూడ, నల్లగొండ, విష్ణుపురం, చిట్యాల రైల్వే స్టేషన్ల నుంచి రైల్వే శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. బియ్యం, సిమెంటు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతితో ఏటా సుమారు రూ.250 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నట్లు అంచనా. అయినా నేటికీ సింగిల్ లైన్ ఉండడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు రైళ్ల రాకపోకలకు ఆలస్యం అవుతుండడంతో రత్తు చేయాల్సిన పరిస్థితులూ ఏర్పడుతున్నాయి.
జిల్లా డిమాండ్లపై తీవ్ర నిర్లక్ష్యం
రైల్వేశాఖ పరంగా ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం మరోసారి తీవ్ర నిర్లక్ష్యం చేసింది. జిల్లా ప్రాజెక్టుల విషయంలో అనేక సార్లు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేసింది. జిల్లాలోని కీలకమైన రాయగిరి ఎంఎంటీఎస్ పొడిగింపు, బీబీనగర్- నడికుడి డబ్లింగ్ పనులు, సికింద్రాబాద్ – కాజీపేట మార్గంలో మూడోలైన్ నిర్మాణం, రెండు రాజధానుల మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ వంటి కీలకమైన వాటిని కూడా కేంద్రం పెడచెవిన పెట్టడం దుర్మార్గం. ప్రస్తుత సమావేశాల్లో మరోసారి జిల్లా ప్రాజెక్టులపై కేంద్రాన్ని నిలదీస్తా.
– బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభసభ్యుడు