సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతున్నది. అతి త్వరలోనే అర్హులైన రైతులందరికీ పోడు భూముల పట్టాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు పట్టాల పంపిణీకి ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. నల్లగొండ జిల్లాలో 1,971, సూర్యాపేట జిల్లాలో 84, యాదాద్రి భువనగిరి జిల్లాలో 211 మంది రైతులను అర్హులుగా గుర్తించి పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణపై దృష్టి సారించింది. రెండు మూడ్రోజుల్లో ప్రింటింగ్ పూర్తయితే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రజాప్రతినిధుల సమక్షంలో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ) : పోడుభూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఆది నుంచి ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. 2005 కంటే ముందు నుంచి సాగులో ఉన్న రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలు రూ పొందించి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసింది. దరకాస్తుల స్వీకరణ నుంచి మొదలుకుని అర్హులైన వారిని గుర్తించే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఆర్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో కూడిన కమిటీ పరిశీలించింది. తాసీల్దారులు, ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి, దరకాస్తుదారుల నుంచి భూమి తాలుకా ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, అప్పటి ఓటర్‌కార్డు లాంటి పత్రాలను సేకరించి వాటిని ప్రత్యేక యాప్‌లో పొందుపర్చారు. పత్రాలు సక్రమంగా ఉన్న రైతుల సమక్షంలో క్షేత్ర స్థాయి భూమి వద్ద వెళ్లి సదరు భూముల వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. అటవీ భూములకు అటంకం లేకుండా ఏండ్ల తరబడి పొడు భూమి సాగు చేసుకుంటున్న నిజమైన రైతులకు అన్యాయం జరుగకుండా పకడ్బందీగా వ్యవహరించారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గత నవంబర్లోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఒకటికి రెండు సార్లు సరిచూస్తూ అర్హులైన వారి రైతుల జాబితాను సిద్ధం చేశారు.
నల్లగొండ జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో పోడు భూముల సమస్య ఉండగా అర్హులైన 1,971 మంది రైతులను గుర్తించారు. వీరు మొత్తం 3,200 ఎకరాల్లో పోడు భూములను సాగు చేస్తున్నట్లుగా ఫైనల్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకీడు, మఠంపల్లి మండలాల్లోనే పోడుభూముల సమస్య ఉన్నట్లుగా స్పష్టమైంది. ఇక్కడ దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో సుమారుగా మొత్తం 21వేల ఎకరాల అటవీ భూములు ఉండగా దాదాపు అంతే స్థాయిలో 20,480 ఎకరాలకు దరఖాస్తుల వచ్చాయి. ఈ పరిస్థితిని చూసి అధికార యంత్రాంగమే అవాక్కైంది. ఇక్కడ వాస్తవంగా వివిధ దశల్లో సమగ్ర విచారణ అనంతరం మొత్తం 83.30 ఎకరాలకు సంబంధించిన 84 మంది మాత్రమే నిజమైన పోడు రైతులుగా స్పష్టమైంది. ఇకపోతే యాదాద్రి భువ నగిరి జిల్లాలో 211 మందిని అర్హులుగా గుర్తించారు. ఇవి కాకుండా అక్కడకక్కడా క్షేత్రస్థాయిలో వస్తున్న అభ్యంతరాలు, ఫిర్యాదులపైనా అధికార యంత్రాంగం తక్షణమే స్పందిస్తున్నది. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ వీటిని పరిష్కరిస్తున్నారు.
పోడుభూముల పట్టాలపై నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ‘నమస్తే తెలంగాణ’తో స్పందిస్తూ పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నేత్వత్వంలో పకడ్బందీగా అర్హుల జాబితాను సిద్ధం చేసినట్లు చెప్పారు. జాబితా ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ కూడా ప్రారంభమైందని, త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఇప్పటికే అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసిన జిల్లా అధికార యంత్రాంగం అందుక నుగుణంగా పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణపై దృష్టి సారించింది. గ్రామాల వారీగా గుర్తించిన పోడు రైతుల వివరాలతోపాటు భూమి సరిహద్దులు సైతం నిర్ధారించారు. వీటన్నింటినీ ఫైనల్ చేసి పొందుపరిచిన అనంతరం కలెక్టరేట్లో పోడు పట్టాల నమూనాలను డౌన్లోడ్ చేసి మరోసారి చెక్ చేస్తున్నారు. ఓకే ఉంటే ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో పాసుపుస్తకాల ముద్రణకు పంపిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాకు సంబంధించిన 1100 పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ పూర్తయింది. మిగతా పుస్తకాల ముద్రణ కూడా ఒకటిరెండు రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలిసింది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ముద్రణ కోసం పంపించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వీటి ముద్రణ కూడా నెలాఖరులోగా పూర్తి చేసి సిద్దం చేస్తామని ప్రకటించారు.