యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రానుపోను కిరాయి డబ్బులు ఇచ్చి రప్పించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో 140 సర్పంచ్‌లు, 1,161 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు 20.92 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అనంతరం పోలింగ్ శాతం పుంజుకుంది. 11గంటల వరకు 57.12 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 82.53శాతం, ఆ తర్వాత 91.72 శాతం నమోదైంది. పోలింగ్ సరళిని కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు.
పోచంపల్లిలో 93.11 శాతం..
రెండో విడతలో 91.72 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఇక్కడ 2,02,716 మంది ఓటర్లు ఉండగా, 1,85,937 ఓట్లు పోలయ్యాయి. 91.83 శాతంతో 92562 మంది పురుషులు, 91.62 శాతంతో 93,375 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా భూదాన్‌పోచంపల్లి మండలంలో 93.11 శాతం మంది ఓటేశారు. ఆ తర్వాత భువనగిరి మండలంలో 93.08 శాతం, బీబీనగర్‌లో 91.38, వలిగొండలో 91.24, రామన్నపేటలో 90.58 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. 2019లో 93.71శాతం ఓట్లు పోలయ్యాయి. భూదాన్ పోచంపల్లి మండలంలో రెండో దశ పోలింగ్‌లో ధన ప్రవాహం ఏరులై పారింది.
ఎలాగైనా గెలవాలని పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేశారు. ముఖ్యంగా మండలంలో వేలకు వేలు పంచారు. దేశ్ముఖి గ్రామంలో ఓటర్ల పంట పండింది. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. శనివారం రాత్రి ముగ్గురు సైతం ఓటుకు 10వేల చొప్పున పంచారు. ఆదివారం ఉదయం ఓ అభ్యర్థి మరో 2వేలు ముట్టజెప్పారు. ఇంతటితో ఆగకుండా ముగ్గురు వార్డు మెంబర్లు సైతం 3 వేల చొప్పున పంపిణీ చేశారు. అంతిమంగా ఒక్కో ఓటరుకు 41వేల వరకు ముట్టాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఈ గ్రామానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ఇదే మండలానికి చెందిన దోతిగూడెంలో సర్పంచ్ పదవికి 6వేలు, వార్డు మెంబర్ పదవికి 4వేలు, అంతమ్మగూడెంలో 6 వేలు నుంచి 7వేలు చొప్పున పంచారు. బీబీనగర్ మండలంలోని మగ్ధుంపల్లిలో 5వేలు, బీబీనగర్ టౌన్లో 4వేలు, మందు, గిఫ్ట్ హ్యాంపర్, రహీంఖాన్ గూడెంలో 5వేలు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల రిజర్వు స్థానాలు కావడంతో మేజర్ పంచాయతీల్లో పెద్ద మొత్తంలో పంపిణీ జరగలేదు.