పెద్దవూర, ఆగస్టు10 : సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిపోయిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. పెద్దవూర మండలంలోని పాల్తీ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ పడిపోయిన ప్రాంతాన్ని శనివారం ఆయన ఆ పార్టీ బృందంతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న మెగా ఇంజినీరింగ్ కంపెనీ కాల పరిమితిలోగా నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పర్యవేక్షించకపోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపితే ఇలాంటివి తలెత్తేవి కాదని చెప్పారు.
ప్రాణనష్టం జరుగలేదని, అధికారులు, ఏజెన్సీ అధికారుల అత్యుత్సాహం ప్రమాదానికి కారణమైందని అన్నారు. పై నుంచి వరద వస్తున్న సమయంలో సిమెంట్ పనులు చేయడం వల్ల క్యూరింగ్ కాగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నదని చెప్పారు. పర్వేదుల నుంచి ప్రాజెక్టు వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కూడా సరిగా చేయలేదని అన్నారు.
ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు బండ శ్రీశైలం, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, చిన్నపాక లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పి.నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, షేక్ బషీర్, పూల సత్యనారాయణ, దుబ్బ రామచంద్రం, బాపురెడ్డి పాల్గొన్నారు.