నల్లగొండ, ఆగస్టు 7: సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే వారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైన సర్కార్ అర్హులై, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో స్థానిక తాసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సర్కార్ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో సమస్యలు తలెత్తకుండా ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అధికార యంత్రాంగమే దరఖాస్తులను ఆన్లైన్ చేసి క్షేత్ర స్థాయిలో విచారణ చేసి మంజూరు చేయనున్నది.
సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు
దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉచితంగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సొంత జాగా ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నది. అయితే ఈ నిధులు తొలి దఫాలో బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష, రూఫ్ లెవల్లో రూ.లక్ష, ఇల్లు పూర్తి అయ్యాక మరో లక్ష చొప్పున అందించనున్నది. అయితే లబ్ధిదారుడు ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రెండు రూములతో పాటు బాత్రూమ్ను తనకు ఇష్టమైన పద్ధతిలో నిర్మించుకోవచ్చు. రేషన్ కార్డుతో పాటు స్థానికంగానే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. మహిళల పేరు మీద వచ్చే నెల నుంచి దరఖాస్తు చేసుకుంటే వారి పేరు మీద ఇల్లు మంజూరు చేయనున్న సర్కార్ వంద శాతం సబ్సిడీతో మూడు లక్షల రూపాయలు ఇవ్వనుంది.
నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున..
నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ప్రభుత్వం జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు మూడు వేల చొప్పున మొత్తంగా 18 వేల ఇండ్లకు ఆర్థిక సాయం అందించనున్నది. ఇంటికి రూ.3 లక్షల చొప్పున మొత్తంగా రూ.540 కోట్లు తొలి విడుతగా ఇండ్ల నిర్మాణాలకు ఇవ్వనుంది. గృహలక్ష్మి పథకం కింద ఇండ్ల నిర్మాణాల కోసం తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ యంత్రాంగం ఈ పథకం కోసం ప్రత్యేక యాప్ను రూపకల్పన చేసింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఆ యాప్లో వచ్చిన దరఖాస్తులు అప్లోడ్ చేసిన తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వారి అర్హతను గుర్తించి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారుకు ఇల్లు మంజూరు చేయనున్నారు. ఆ తర్వాత ఇల్లు నిర్మాణం మొదలు పూర్తి అయ్యేదాక ఆయా స్టేజీల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేసిన తర్వాత ప్రభుత్వం డబ్బులను లబ్ధిదారు ఖాతాకు జమ చేయనుంది.
8వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్లు
సెంటు జాగా కూడా లేకుండా అద్దె ఇండ్లల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న పేదలకు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే 8,155 ఇండ్లు మంజూరు చేసింది. వాటిలో 3,300 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా 2,800 ఇండ్లు పూర్తి అయ్యాయి. పూర్తి అయిన వాటిలో 290 మంది లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేసిన జిల్లా అధికార యంత్రాంగం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో మరో 1,500 ఇండ్లకు సంబందించి లక్కీ డ్రా సైతం తీసి లబ్ధిదారులకు అందజేసే పనిలో నిమగ్నం అయింది. ఇక మిగిలిన ఇండ్లల్లో కొన్ని ఆయా స్టేజీల్లో ఉండగా మరికొన్ని టెండర్ పూర్తి అయ్యాయి.