నీలగిరి, ఏప్రిల్ 16 : నగర పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. పారిశుధ్య కార్యక్రమాల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన నల్లగొండలోని 4వ, 5వ, 21వ డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో జరుగుతున్న ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమం, వార్డులలో స్వీపింగ్ పనులు, డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించారు. ప్రతి ఇంటి నుండి తప్పనిసరిగా చెత్త సేకరణ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అలాగే, ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.
ఇందుకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగర పరిశుభ్రతను మెరుగుపర్చడానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్ రెడ్డి, శానిటరీ జవాన్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.