పచ్చని బతుకులను పగబట్టిన కాంగ్రెస్
సమైక్య పాలనలో వ్యవసాయం అంటేనే విరక్తి పుట్టేలా చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే తరహా కుట్రలకు తెరలేపింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పచ్చబడడం, రైతు తలెత్తుకుని తిరుగడం అస్సలు ఆ పార్టీకి గిట్టడం లేదు.
- పూటకో మాటతో బుసలు కొడుతున్న నేతలు
- రైతు వెన్ను విరిచేలా వ్యవహారం
- మొదటికే మోస వస్తుందని రైతుల్లో భయాందోళన
- భూముల ధరలు పడిపోయే ప్రమాదం
- నిరంతర కరెంట్ స్థానంలో 3 గంటల విద్యుత్
- ఆచరణ సాధ్యం కాని 10హెచ్‌పీ మోటర్లతో దిగాలు
- వ్యవసాయంపై విరక్తి వచ్చేలా కాంగ్రెస్ చర్యలు
- సాగుభూమి తగ్గిపోయి మళ్లీ వలసలకు ఆస్కారం
- రోజుకో తీరుగా రైతు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్
- మండిపడుతున్న రైతులు, రైతు సంఘాల నేతలు
సమైక్య పాలనలో వ్యవసాయం అంటేనే విరక్తి పుట్టేలా చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే తరహా కుట్రలకు తెరలేపింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పచ్చబడడం, రైతు తలెత్తుకుని తిరుగడం అస్సలు ఆ పార్టీకి గిట్టడం లేదు. అందుకే అధికారమిస్తే ఇది చేస్తాం..అది చేస్తాం అంటూ ఆ పార్టీ నేతలు తిరోగమన మాటలు మాట్లాడుతున్నారు. 24 గంటల కరెంట్ తీసి 3 గంటల కరెంట్, దాని కోసం 5హెచ్‌పీ మోటర్లను పీకేసీ 10హెచ్‌పీ మోటర్లను, విభజించు, తగదా పెట్టు అనే రీతిలో రైతు బంధును, ధరణి తీసి భూమి హక్కులను రైతుల నుంచి గుంజి కౌలుదారులకు వంటివెన్నో చేస్తామని బాజాప్తా ప్రకటిస్తున్నారు.
స్వరాష్ట్రంలో నిశ్చింతగా ఉంటున్న రైతుల గుండెల్లో కాంగ్రెస్ నేతల మాటలు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయం అధోగతి పాలుకావడమే కాకుండా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న ఆందోళన రేపుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అరకోటి నుంచి కోటి రూపాయలకు చేరిన ఎకరం భూమి ధర మళ్లీ డమాల్ అవుతుందని రైతులు భయపడుతున్నారు. 3 గంటల కరెంట్ అయితే సాగునే బంద్ చేసుకోక తప్పదని వాపోతున్నారు. 10హెచ్‌పీ మోటర్లు బిగించాల్సి వస్తే దాని కంటే మోటర్ల జోలికే పోకుంటే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణిని తీసేసి అన్ని పాత కాలమ్స్ పెట్టి కౌలుదారులకు హక్కులు కల్పిస్తే భూములపై అసలు రైతుల ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఆందోళన కనిపిస్తున్నది. కౌలుదారులకు రైతుబంధు వర్తింపజేస్తే భూములు కౌలుకు దొరుకడమేమో కానీ.. భూములు పడావు పడి సాగు విస్తీర్ణం పడిపోవడం ఖాయమన్న చర్చ సర్వత్రా సాగుతున్నది.
తెలంగాణ వచ్చే నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి రెండు నుంచి మూడు లక్షల రూపాయల ధర పలికేది. అలాంటిది వ్యవసాయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో భారీ వృద్ధి సాధించింది. సాగునీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు వ్యయసాయానికి ఊతమిచ్చాయి. దాంతో ప్రస్తుతం జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇలా భూములన్నీ సాగులోకి రావడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరం ధర కనిష్ఠంగా రూ.30 లక్షల నుంచి గరిష్ఠంగా కోటి రూపాయలు దాటింది.
వ్యవసాయంపై మక్కువ పెరుగడంతో అదే స్థాయిలో భూమిపైనా అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఈ వృత్తి, ఆ వృత్తి అని లేకుండా అన్ని వృత్తుల్లోని వారూ భూమి కొనుగోలుకు సిద్ధ్దపడుతున్నారు. దాంతో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎకరం భూమి ఉన్న రైతు కూడా ఇవాళ ఎంతో భరోసాతో కనిపిస్తున్నారు. ఆ భూమిని సాగు చేసేందుకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం, పంటల కొనుగోళ్లు, పక్కాగా భూమి హక్కులు కల్పించడంతో సన్న, చిన్నకారు రైతులు సైతం నిశ్చింతగా ఉన్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు మళ్లీ రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. సౌకర్యాలు తీసేయడంతో వ్యవసాయం అంటే అయిష్టత పెరిగితే తిరిగి భూముల ధరలు పడిపోతాయన్న చర్చ సాగుతున్నది.
సాగు విస్తీర్ణం తగ్గే ప్రమాదం
24 గంటల కరెంటు స్థానంలో 3 గంటల కరెంటు ఇస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోనుంది. 2018 జనవరి నుంచి సీఎం కేసీఆర్ సర్కార్ వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నది. సాగునీటి వసతిని మెరుగుపర్చడంతో నిరంతర కరెంటుతో సాగుకు విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ప్రతి సీజన్లో క్రమం తప్పకుండా ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుబంధు డబ్బులు ఇస్తుండడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు సిద్ధపడుతున్నారు. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు ధరణి పోర్టల్ సాయంతో వారం రోజుల్లోపే నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులే జమ అవుతుండడంతో ఏ ఇబ్బందీ లేకుండా పోయింది.
ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014లో 13 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా.. తొమ్మిదిన్నరేండ్లలో అమాంతం 26 లక్షల ఎకరాలకు పెరిగింది. దాంతో ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. ఇలా దూకుడు మీదున్న వ్యవసాయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు కాళ్ల మధ్య కట్టెలు పెట్టినట్లే ఉన్నాయని రైతులు మండిపడుతున్నారు. మంచిగా సాగిపోతున్న వ్యవసాయాన్ని చేతనైతే మరింత బాగు చేయాలే గానీ.. ఉన్న దాన్ని చెడగొట్టి పైశాచికానందం పొందేలా కాంగ్రెస్ అగ్రనేతల ప్రకటనలున్నాయని ధ్వజమెత్తుతున్నారు.
గ్రామాల్లో అల్లకల్లోలం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 35 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంటే.. అందులో మూడో వంతు అంటే సుమారు 26లక్షల ఎకరాలు సాగుభూమిగా మారింది. సమైక్య పాలనలో ఇది 30 శాతంగానే ఉన్నది. అంటే వ్యవసాయం లాభసాటిగా మారడంతో మళ్లీ గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతుల చేతుల్లో పైసలాడుతుండడంతో సమస్త వృత్తిదారులకు ఉపాధి దొరుకుతున్నది. ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో పని కల్పించేందుకు ఉపాధిహామీ పథకం లాంటివి కాంగ్రెస్ తీసుకొస్తే.. నేడు అదే ఉపాధి హామీని నిలిపివేస్తే బాగుంటుందన్న పరిస్థితి వచ్చింది. అంటే వ్యవసాయంలో చేసుకున్నోళ్లకు చేసుకున్నంత పని అందుబాటులోకి వచ్చింది.
దాంతో పనిలేక ఆకలితో పస్తులుండే పరిస్థితులు గ్రామాల్లో కనపడకుండా పోయాయి. గతంలో ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు దానిమీద పూటగడవక భూములు వదిలేసి పట్టణాలకు వలస వెళ్లారు. నేడు అలాంటి రైతులంతా గ్రామాలకు వచ్చి సొంత భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నలుగురికి పని కల్పిస్తూ తనకు అవసరం ఉన్నప్పుడు నలుగురితో కలిసి పనులకు వెళ్లగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతల చర్యలు మళ్లీ భూములు వదలివెళ్లేలా ఉన్నాయి. ఇదే జరిగితే గ్రామాల్లో వ్యవసాయం కుంటుపడి ఉపాధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కానుంది. పైగా గతంలో మాదిరిగానే పట్నాలకు వలసలు తప్పవన్నది నిజం.
కాంగ్రెస్ విధానాలతో మళ్లీ రైతుల వలసలు
కాంగ్రెస్ పార్టీ విధానాలు రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ఉన్నాయి. మళ్లీ వ్యవసాయం అథపాతాళానికి దిగిజారిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందే ఆ పార్టీ నాయకులు సాగుపై, వ్యవసాయంపై ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారు. మరి అధికారంలోకి వస్తే ఇంకే చేస్తరో ఏమో..? 10 హెచ్‌పీ మోటరు పెట్టుకుంటే వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్నరు. అసలు 10 హెచ్‌పీ మోటరు పెట్టడం సాధ్యం కాని పని. మరి మూడు గంటల కరెంట్ ఇస్తే సగం పొలం కూడా నీళ్లు పారదు. రైతులు సాగు చేయడం మానేసే పరిస్థితి ఏర్పడుతది.
భూములకు రక్షణ కల్పిస్తున్న ధరణి పోర్టల్ ఎత్తేస్తామంటున్నరు. భూమి యజమానిని వదిలేసి కౌలు రైతుకు రైతుబంధు ఇస్తామంటున్నరు. దీంతో భూమి ఉన్న రైతు తీవ్రంగా నష్టపోతడు. రైతులు తమ భూములను కౌలుకు ఇయ్యడమే మానేస్తరు. భూములన్నీ పడావుపడి వాటి ధరలు కూడా పడిపోతయ్. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నరు. తెలంగాణ ఏర్పాటయ్యాక, సీఎం కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు.
సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహకాలతో రైతులు దర్జాగా బతుకుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఎకరం పొలం రూ. 30 లక్షలకు తక్కువ ఖరీదు లేదు. కాంగ్రెస్ విధానాలతో భూముల ధరలు పడిపోతాయి. వ్యవసాయం కుంటుపడుతుంది. మళ్లీ పాతరోజులు పునరావృతం అవుతాయి. రైతులు సాగు మాని కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వలస పోయే ప్రమాదం ఉంది. రైతులు గమనించాలి సాగును, రైతును నష్టపర్చే విధానలు తీసుకొస్తామంటున్న కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే రైతులకు లాభం చేకూరుతుంది.
– డి. నారాయణరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్, దామరచర్ల
మా భూమి పైసలు కౌలు రైతులకు ఎట్లిస్తరు
కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు పైసలు కౌలు రైతులకు ఇస్తమంటున్నరు. భూమి యజమానికి ఇవ్వకుంటే మేము భూమిని కౌలుకు ఎందుకివ్వాలో వాళ్లే చెప్పాలి. నాకు పది ఎకరాల భూమి ఉంది. నా కొడుకు పొటకూటి కోసం హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీ పని చేస్తున్నాడు. నా ఆరోగ్యం సరిగా లేక పోవడంతో వ్యవసాయం చేయలేక కౌలుకి ఇస్తున్నాం. భూమి కౌలు డబ్బులతో మందులు, ఇల్లు గడుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు మాకు ఎంతగానో ఆసరా అవుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్లు రైతుబంధు కౌలు రైతులకు ఇస్తమంటున్నరు. అప్పుడు మా పరిస్థితి ఏంటి.
మాకు భూమి ఊరికనే రాలే. ఎంతో కష్టపడి పైసా పైసా కూడా బెట్టుకొని సంపాదించుకున్నం. మాకు రైతుబంధు ఇయకుంటే కౌలు రైతులకు భూమి ఎందుకియ్యాలె. మాకు, కౌలు రైతులకు మధ్య గొడవలు పెట్టేందుకే వారు ఇదంతా మాట్లాడుతున్నరు. మా లాగా ఇతరులు కూడా భూములు కౌలుకు ఇయ్యకుంటే చిన్న రైతుల పరిస్థితి ఏంటి. వారు ఏం చేసి బతుకాలె. ఒక వైపు మూడు గంటల కరెంట్ చాలంటరు. ధరణి ఎత్తేస్తమంటరు. ధరణి రద్దు చేస్తే మా భూములకు రక్షణ ఉండదు. కరెంట్ సరిగా లేకుంటే వ్యవసాయం సాగక భూముల ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని దెబ్బతీసే కుట్రే.
– పెద్దిరెడ్డి యాదగిరి రెడ్డి, దామెర, నాంపల్లి మండలం
రైతు బంధును ఆపిన వైనం
ఎన్నికల కమిషన్ ఇచ్చిన అనుమతి మేరకు ఇవ్వాళ యాసంగి రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం చేసిన ఫిర్యాదుతో రైతుబంధుకు ఈసీ మోకాలడ్డింది. దాంతో మరోసారి కాంగ్రెస్ కుట్రలు ఎలా ఉంటాయో స్పష్టమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే రైతుబంధు డబ్బులు రైతు చేతికి అందనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఉమ్మడి జిల్లాలో 11 లక్షల పైచిలుకు రైతులకు సుమారు రూ.1300 కోట్ల రైతుబంధు డబ్బులు అందాల్సి ఉంది. కాంగ్రెస్ నేతల కుట్రలతో దానిని నిలిపివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందిస్తూ ‘మళ్లీ బీఆర్ఎస్ సర్కారే అధికారంలోకి వస్తుంది.. వారం, పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తాం’ అంటూ రైతులకు భరోసానిచ్చారు. కాంగ్రెస్ కుట్రల పట్ల రైతులు అప్రమత్తంగా ఉంటూ ఆ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపాలని పిలుపునిచ్చారు. ఇలా రోజుకో తీరుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని అందలమెక్కిస్తే.. వ్యవసాయంతో పాటు రైతుల పని ఖతమేనన్న చర్చ సర్వత్రా సాగుతున్నది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వొద్దని, మరోమారు కేసీఆరే సీఎం కావాలని రైతులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే భూములకు విలువ ఉండదు
ఒకప్పుడు గ్రామాల్లోని గుట్టలు, చవుడు, సుదూర ప్రాంత భూములకు విలువ ఉండేది కాదు. ఆపతికి అమ్ముదామన్నా.. కొనే వారు లేకుండా పోయేది. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, సరిపోను సాగునీరు ఇస్తుండడంతో అన్ని భూములు పచ్చటి పొలాలయ్యాయి. ఎలాంటి భూమికైనా మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. తెలంగాణ రాక ముందు గ్రామాల్లో ఎకరం ధర లక్ష లోపే ఉండేది. ప్రస్తుతం మండలాల్లో, గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గ్రామాల్లో లక్షల్లో, పట్టణాలల్లో కోట్లకు చేరింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో మా భూములకు రక్షణ ఏర్పడింది. మాకు ఇంత భూమి ఉంది అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడేమో కాంగ్రెస్ నాయకులు ధరణి ఎత్తివేస్తాం, 3 గంటల కరెంట్ ఇస్తాం అంటూ మాటలు మాట్లాడుతున్నరు. మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా పారదు. దాంతో వ్యవసాయం సాగక భూములు బీళ్లుగా మారడం ఖాయం. రైతుబంధు కౌలు రైతులకు ఇస్తామంటున్నరు. అలా చేస్తే మన భూములకున్న భద్రత పోతుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలతో తెలంగాణలో భూముల ధరలు పడిపోయే అవకాశం ఉన్నది. మళ్లీ పాతకాలం నాటి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే రైతు సంక్షేమం గురించి ఆలోచించే బీర్ఎస్ పార్టీకే మేమంతా మద్దతు తెలుపుతాం.
– పోగుల సుధాకర్‌రెడ్డి, రైతు, కిష్టాపురం, మునుగోడు మండలం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

