ఆత్మకూరు(ఎం), ఏప్రిల్3 : జానకిపురంలో తీవ్ర కలకలం రేపిన సిమి ఉగ్రవాదులు దాడి ఘటనకు శుక్రవారంతో పదేండ్లు నిండుతున్నాయి. నాటి విషాద ఘటన ఇప్పటికీ కండ్లముందు కదలాడుతూనే ఉంది. 2015 ఏప్రిల్ 4న అప్పటి మోత్కూర్, ఇప్పటి అడ్డగూడూరు మండలంలోని జానకిపురంలో సిమి ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో అప్పటి ఆత్మకూరు(ఎం) ఎస్ఐ డి. సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందారు.
నాడు జానకిపురంలో దోపిడీ దొంగలు సంచస్తున్నారనే సమాచారంతో పట్టుకునేందుకు అప్పటి ఎస్ఐ సిద్దయ్యతో పాటు పోలీసులు నాగరాజు, శివ, మధు, శ్రీను, హరిబాబు, నగేశ్ వాహనంలో బయల్దేరారు. దోపిడీ దొంగల ముసుగులో ఉన్న సిమి ఉగ్రవాదులను పోలీసులు పట్టుకోగా పోలీస్ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ నాగరాజుపై కాల్పులు జరుపడంతో అక్కడిక్కడే మృతి చెందా డు. మిగతా పోలీసులు ప్రాణాలతో బయటపడి ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్ఐ సిద్దయ్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సిద్దయ్య సాధారణ కుటుంబంలో జన్మించి పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ నాగరాజు నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ పరిధి రసూల్‌పురకు చెందిన వ్యక్తి. వివాహం అయిన 6నెలలకే ఉగ్రవాదుల కాల్పుల్లో నాగరాజు మృతి చెందడం బాధాకరం.