్యలగూడ, మే 24 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు దాని కింద ఉన్న మేజర్, మైనర్ కాల్వలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వచ్చే వానకాలంలో పంటలకు సాగు నీరు అందుతుందా లేదా అని అన్నదాతల్లో దిగులు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎడమ కాల్వకు, మేజర్, మైనర్ కాల్వల మరమ్మతులకు నిధులు విడుదల చేయడం లేదు. దాంతో కాల్వలు అస్తవ్యస్తంగా మారి చివరి భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో యాసంగి పంటలు అయిపోయి, కాల్వలకు నీరు ఆపగానే ఎడమకాల్వ, మేజర్, మైనర్ కాల్వలకు కావాల్సిన మరమ్మతుల ప్రపోజల్స్ తీసుకొని వెంటనే నిధులు మంజూరు చేసేది. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించేవారు. నాడు ప్రభుత్వ ముందుచూపుతో 2014 నుంచి 2023 వరకు 18 పర్యాయాలు ఎడమకాల్వ కింద రైతులకు నీటి ఇబ్బంది రాలేదు. గత ప్రభుత్వం కారణంగానే ఎడమకాల్వ కింద స్థిరీకరరించిన ఆయకట్టు అంటే ఎక్కువగా పంటలు సాగులోకి వచ్చాయి.
ఏడాదిన్నర కాలంగా ప్రధాన కాల్వ మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల గత వానకాలం, యాసంగిలో రైతులు ఇబ్బంది పడ్డారు. కాల్వలకు గండ్లు చివరి భూములకు నీళ్లు రాక పంటలు ఎండిపోయాయి. నాట్లు వేయాల్సిన రైతులు నార్లు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయారు. దీనివల్ల పంటల దిగుబడులు చాలా తగ్గిపోయాయి. ఇటీవల రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి కాల్వల మరమ్మతుల కోసం నిధులు అవసరమని తేల్చారు. దీంతో అధికారులు మరమ్మతుల కోసం ప్రపోజల్స్ తయారు చేసి పంపించినట్లు తెలిపారు. కానీ ఇంతవరకు మరమ్మతులకు నిధుల విడుదల కాలేదు. ఒకవైపు వానకాలం ప్రారంభమైందని, సమయం అయిపోయిన తర్వాత నిధులు విడుదల చేసినా ఫలితం ఉండదని రైతులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడమ కాల్వ, మేజర్, మైనర్ కాల్వలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కాల్వలు కోతకు గురై గండ్లు పడ్డాయి. ఎడమకాల్వ నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల లైనింగ్‌లు జారిపోయాయి. కొన్ని చోట్ల మేజర్ తూముల వద్ద కోతకు గురై ఉంది. షట్టర్లు సరిగా పనిచేయక కొన్నిచోట్ల తూములకు గండ్లు పడి సాగు నీరు వృథాగా పోయే పరిస్థితి ఉంది. దాంతో ఎడమ కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. నీటిని ఎక్కువగా వదిలితే గండ్లు పడి పంటలు మునిగే ప్రమాదం ఉంది. ప్రతియేటా మేజర్, మైనర్ కాల్వలకు మే, జూన్ మాసాల్లో అత్యవసర మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలపై దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా అత్యవసర పనులకైనా నిధులను విడుదల చేసి మరమ్మతులను నిర్వహిస్తేనే చివరి భూములకు సాగునీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు.
స్థిరీకరించింది -2,83,935 ఎకరాలు
42 ఎత్తిపోతల పథకాల కింద – 86,112 ఎకరాలు
మొత్తం – 3,70,047 ఎకరాలు
సాగర్ కాల్వలకు మరమ్మతులు నిర్వహిస్తేనే చివరి భూములకు సక్రమంగా సాగు నీరు అందుతుంది. ప్రధాన కాల్వ కట్టలు బలహీనంగా మారిన చోట గండ్లు పడే పరిస్థితి ఉంది. మరమ్మతులు చేయకపోతే ఎప్పుడు కోతకు గురవుతాయోనని భయంగా ఉంది. మే, జూన్ నెలల్లోనే మరమ్మతులు పూర్తి చేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత నిధులు ఇచ్చినా పనులు చేపట్టే పరిస్థితి ఉండదు.
– పి.యాదగిరి, రైతు, మిర్యాలగూడ
సాగర్ ఎడమకాల్వకు ప్రతి సంవత్సరం అత్యవసర మరమ్మతులు నిర్వహిస్తారు. కానీ ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులకు నిధులు విడుదల చేయలేదు. దాంతో కాల్వకు గండ్లు పడి పంట పొలాలకు తీవ్రంగా నష్టం జరుగుతున్నది. పోయిన వానకాలం కాల్వకు రెండు సార్లు గండిపడి పంటలు మునిగాయి. నాట్లు పెట్టినాక 15, 20 రోజుల దాకా నీళ్లు రాకపోవడంతో నాట్లు ఎండిపోయాయి. దీనివల్ల పంటల దిగుబడి భారీగా తగ్గింది. పంట పెట్టుబడులు ఎల్లక అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ముందు చూపుతో మరమ్మతులు చేస్తే రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేవి.
-బంటు శ్రీను, రైతు, శెట్టిపాలెం