పెన్పహాడ్, జూన్ 06 : పెన్పహాడ్ మండలం మాచారం గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని మాచారం ఆవాసం గుడిబండ తండాకు చెందిన ఉపాధి హామీ కూలీలు శనివారం ఉపాధి హామీ పని ముగించుకుని నేరుగా ఎంపీడీఓ కార్యాలయం ముందు గల నేరేడుచర్ల= సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పి.జ్యోతి తమకు వద్దని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 100 మంది ఉపాధి కూలీలు ఎంపీడీఓ జానయ్యకు వినతిపత్రం అందజేశారు.
ఉపాధి హామీ పథకంలో తమకు సరిగ్గా కూలీ పని కల్పించడం లేదని, వారం రోజులు పని చేసిన తర్వాత కూడా ఒక్కరోజు కూలి డబ్బులు మాత్రమే తమ అకౌంట్ లో పడుతున్నట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ సరిగ్గా ఫొటోలు తీయకపోవడంతో తాము నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ ఏకస్వామిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా బాలు, భూక్యా బాబ్లీ, భూక్యా నరేందర్, భూక్యా లింగ, భూక్యా భిక్షం, భూక్యా వీరేందర్, భూక్యా హరిలాల్, భూక్యా నాగు నాయక్ పాల్గొన్నారు.