నూతనకల్, డిసెంబర్ 4 : జిల్లాలో రైతులు ఎక్కువగా మిరప పంటలను సాగు చేస్తుంటారు. ఈ పంట ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్నది. ఈ పంటలో రైతులు తెగుళ్ల బెడదను ఎదుర్కొంటున్నారు. తెగుళ్లను ప్రాథమిక దశలోనే నివారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మిరప పంటలో ప్రస్తుతం ఎక్కువగా పూత ఈగ, రసం పీల్చే పురుగులు తదితర తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పూత ఈగ ఆకుల కింది భాగంలో ఆశించి ముడుచుకపోవడం రసం పీల్చే పురుగులు వృద్ధి చెంది నష్ట పరుస్తుంటాయి. ఇవి ఎక్కువగా పంట పూత, పిందె దశలో ఆశించి కాయను ఎదుగకుండా చేయడంతో కాయలు ఎండి రాలిపోతుంటాయి. మొగ్గ దశలో ఆశిస్తే అండాశయం తెల్లగా ఉబ్బడం కాయలు గిడన బారి పోవడం కాయ సైజు తగ్గడం వంకరటింకరగా పెరిగి నష్టం కలుగజేస్తాయి.
భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కాపు దశలో ఉన్న మిరప పంటకు ఎండు తెగులు సోకుతుంది. మఖ్యంగా నీటి పారుదలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఈ తెగులు కనిపిస్తుంది. ముందుగా తెగులు సోకిన మొక్కల పై భాగంలోని ఆకులు లేత పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఈ తర్వాత ఆకులన్నీ ఎండి మొక్క చనిపోతుంది. కాండం మొదలు భాగాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ రంగులో నిలువు చారలు కనిపిస్తాయి. శిలీంద్రం వల్ల సోకే ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్భండజమ్ చొప్పున కలిపి ఆ ద్రావణాన్ని వేర్లు తడిసేలా మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడెఫార్ములేషన్ 50 కిలోల పశువుల ఎరువులో కలిపి దానిపై నీరు చల్లి పాలిథిన్ కాగితాన్ని కప్పాలి. అబివృద్థి చెందిన ఆ మిశ్రమాన్ని 15 రోజుల తర్వాత సాళ్లలో చల్లుకోవాలి. నీటి పారుదలలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి.
కాయతొలుచు పురుగుల్లో పోగాకు లద్దెపురుగు, శనగ పచ్చపురుగు, పచ్చ రబ్బరు పురుగు వల్ల పంటలకు నష్టం వాటిల్లితుంది. ఈ పురుగులను మొదటి దశలో ఆకులను నష్ట పరిచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినేస్తాయి.
చలి వాతావరణంలో కొమ్మ ఎండుకాయ కుళ్లు తెగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెగులు కారణంగా ముదురు కొమ్మల బెరుడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొమ్మల పై నుంచి కిందికి ఎండిపోతాయి. పండుకాయల మీద నల్లని మచ్చలు ఏర్పడడం అవి సహజ రంగును కోల్పోయి వరిగడ్డి తెలుపు రంగులో కనిపిస్తాయి. అందుకే దీనిని మజ్జిక తెగులు అంటారు. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ ప్రాపికొనజోల్, అజాక్సిస్ట్రోబిన్ లేదా 100 మి.లీటర్ల డైఫెన్కొనజోల్ లేదా 600 గ్రాముల ఫైరాకొలస్ట్రోబిన్-మిటిరం లేదా 400 గ్రాముల ప్రోపినెబ్ కలిపి పిచికారి చేసుకోవాలి
వాతావరణంలో మంచుతో కూడి చలి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఉదృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు సోకిన మొక్కల అడుగున తెల్లటి బూడిద మచ్చలు ఏర్పడుతాయి. క్రమేపి ఆకుల పై భాగానికి కూడా వ్యాప్తి చెందుతాయి. ఆకులు పండు బారి రాలిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పూత పట్టవు, పట్టిన పూత కూడా రాలిపోయి దిగుబడులు తగ్గుతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కెరాథేన్ 1 మి.లీ లేదా బెనోమిల్ 2 మిలీ లీటర్లు చోప్పున లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో పంట మీద రెండు సార్లు పిచికారీ చేయాలి
చాలి గాలులు, మంచు కారణంగా ఆకు పచ్చ తెగుళ్లలో సర్కోస్పోరా, ఆల్లర్నేరియా తెగుళ్లు అధికంగా ఉంటున్నాయి. ఇవి శిలీంద్రాల కారణంగా సోకుతాయి. సర్కోస్పోరా ఆకు పచ్చ తెగులు సోకితే ఆకులపై గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. వాటి మధ్య భాగం తెల్లగా అంచులు ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. ఆల్లర్నియా ఆకు పచ్చ తెగులు ఆకులతో పాటు కాయలపై కూడా కనిపిస్తుంది. ఆకులపై ముదురు గోధుమ రంగులో గుండ్రని లేదా ఒక ఆకారం మంటూ లేని పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. నల్లని శిలీంద్ర బీజాలు కప్పేయడం వల్ల కాయలు రాలిపోతాయి. కొమ్మ ఎండుకాయ కుళ్లు తెగుళ్ల నివారణకు మందులు పిచికారి చేసినట్లయితే ఈ తెగుళ్లు కూడా అదుపులో ఉంటాయి. బ్యాక్టిరాయా ఆకుపచ్చ తెగుళ్లు సోకితే ఆకుల, కాయల మీద మచ్చలు ఏర్పడుతాయి ఇవి తొలుత చిన్నవిగా నీటి మచ్చలుగా ఏర్పడుతాయి. ఆ తర్వాత గోధుమ రంగులో పసుపు పచ్చని వలయాలతో కనిపించి క్రమేపి పెద్దవుతాయి. ఆ దశలో నల్లని గ్రీజు మచ్చలుగా కనిపిస్తాయి. తెగులు కనిపించిన వెంటనే 200 లీటర్ల నీటిలో 600 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 40 గ్రాములు ప్లాంటామైసిన్, పోషామైసిన్ కలిపి 15 రోజల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి