చౌటుప్పల్ రూరల్,మే 10 : రాష్ట్రంలోని పెట్రోలియం ఇంధనం అవసరాలను తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మల్కాపురం టెర్మినల్ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. టెర్మినల్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ప్రాజెక్టు డిప్యూటీ మేనేజర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుతం చర్లపల్లిలో ఉన్న టెర్మినల్ తక్కువ సామర్థ్యంతో ఉన్నందున భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దండుమల్కాపురం గ్రామ పరిధిలోని 89 ఎకరాల్లో రూ. 611 కోట్ల వ్యయంతో ఐవోసీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇక్కడికి పారదీప్, హైదరాబాద్ పైపులైన్ ద్వారా ఇంధనం స్వీకరిస్తామని, టెర్మినల్‌ను 165000 కేఎల్ నిల్వ సామర్ధ్యంతో ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఇంధనం సరఫరా జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, గిర్కాటి నిరంజన్‌గౌడ్, ఇండియన్ ఆయిల్ ఉద్యోగులు సీజీఎం టీకే ఈలమారన్,సూరజ్ కుమార్ పట్నాయక్, జీఎం అందె గణేష్ చక్రవర్తి, శ్రీహరినాధ్, హేమంత బైశ్య,పాపని కిరణ్‌కుమార్, శ్రీకాంత్, రాజశేఖర్ పాల్గొన్నారు.
స్థానిక సర్పంచ్ నిరసన..
ఇండియన్ అయిల్ కార్పొరేషన్ టెర్మినల్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం మల్కాపురం సర్పంచ్ గిర్కాటి నిరంజన్‌గౌడ్ పేరు లేకపోవడంతో ఆయన తన అనుచరులతో టెర్మినల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. జరిగిన పొరపాటును సరిదిద్దుతామని కొద్దిరోజుల్లో మరోక శిలాఫలకం ఏర్పాటు చేస్తామని ప్రాజెక్టు డిప్యూటీ మేనేజర్ విశ్వేశ్వర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.