హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ‘ఆయనొక కాంట్రాక్టర్…బిజినెస్మెన్…రూ.18వేల కోట్ల వర్క్ చేస్తుంటడు’ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులో..మరొకరో చేసిన వ్యాఖ్య కాదు. సొంతపార్టీ నాయకుడు, మునుగోడు బీజేపీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ వెంకటస్వామి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఘన కీర్తిని మునుగోడు ఎన్నికల ప్రచారరథంపై ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. వివేక్ మాట్లాడిన అనంతరం అవును.. నేను కాంట్రాక్టర్నే..తనకు రూ. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది..
అదీ కేంద్రంలోని మోదీ, అమిత్‌షా ద్వయం ఇచ్చారు అన్నంత స్పష్టంగా ఒప్పుకున్నాడు. ‘కాంపీటీషన్లో రూ. 18వేల కోట్ల వర్క్..అదీ ఇప్పుడు కాదు ఆర్నెళ్ల క్రితమే వచ్చింది’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈటల రాజేందర్ సహా ఇతరుల సమక్షంలోనే తన ఘనకీర్తిని చెప్పుకున్నాడు. 1.19 నిమిషాల నిడివిగల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఒక పారిశ్రామికవేత్త మరో కాంట్రాక్టర్‌కు జనం సమక్షంలోనే వేల కోట్ల వ్యాపార లావాదేవీలు ఊరూరా తిరుగుతూ నిసిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారని మునుగోడు ముక్కున వేలేసుకుంటున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే..వేల కోట్ల రూపాయల ప్రయోజనం కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తనను ఎమ్మెల్యేను చేసిన కాంగ్రెస్ పార్టీని వీడి.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతున్నది.