Salad | సలాడ్ అంటే ఆరోగ్యకరమైన ఆహారం అనే అభిప్రాయం చాలామందిలో బలంగా ఉంది. బర్గర్, పాస్తా వంటి ఆహారాలను పక్కన పెట్టి, కూరగాయలతో నిండిన సలాడ్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచి నిర్ణయమే అనిపిస్తుంది. అయితే కొందరిలో మాత్రం సలాడ్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, భారంగా అనిపించడం, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి కూరగాయలే కారణమని భావించడం సహజం. కానీ అసలు సమస్య సలాడ్‌లోని పదార్థాల కలయిక, అధిక మొత్తంలో పచ్చి ఆహారం తీసుకోవడం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక సమతుల్య భోజనంలో శరీరం సులభంగా జీర్ణించుకోగలిగే మోతాదులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, ఫైబర్ ఉండాలి. అయితే సాధారణంగా తీసుకునే చాలా సలాడ్లలో ఫైబర్ ఎక్కువగా, ప్రోటీన్, కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో పచ్చి పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ వాటిని జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.
సలాడ్‌లో ఉండే ప్రతి పదార్థం విడివిడిగా చూస్తే ఆరోగ్యకరమైనదే అవుతుంది. కానీ వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కలిపి తినడం వల్ల కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫెర్మెంటబుల్ కార్బొహైడ్రేట్లుగా పిలిచే ఫాడ్మాప్లు అధికంగా ఉండే కొన్ని ఆహారాలు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఈ లక్షణాలను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు పచ్చి ఉల్లిపాయల్లో ఫ్రక్టాన్స్, శనగలు, కిడ్నీ బీన్స్‌లో గ్యాలాక్టో-ఒలిగోశాకరైడ్లు ఉంటాయి. కాలీఫ్లవర్, పుట్టగొడుగుల్లో మన్నిటాల్, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్‌లో ఫ్రక్టోజ్, సార్బిటాల్ వంటి పదార్థాలు ఉంటాయి. వీటిలో ఒక్కోటి తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ, అన్నింటినీ ఒకే గిన్నెలో కలిపి పెద్ద మొత్తంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పెరిగి ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫైబర్ కడుపులో పేరుకుపోయి కుళ్లిపోతుందనే అభిప్రాయం సరైంది కాదు. అన్ని రకాల ఫైబర్లు ఒకే విధంగా జీర్ణవ్యవస్థపై పనిచేయవు. సాధారణంగా సమస్య కేవలం పాలకూర లేదా లెట్యూస్ వల్ల రావడం కాదు. ఫెర్మెంటబుల్ కార్బొహైడ్రేట్లు, అధిక మొత్తంలో పచ్చి ఆహారం, ఇప్పటికే సున్నితంగా ఉన్న జీర్ణవ్యవస్థ.. ఇవన్నీ కలిసి ఉబ్బరానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది.
వారంలో ఎక్కువగా ఫైబర్ తీసుకోని వారు ఒక్కసారిగా పెద్ద గిన్నె నిండా పచ్చి కూరగాయలను తినడం ప్రారంభిస్తే కూడా ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ తీసుకునే పరిమాణాన్ని ఒక్కసారిగా పెంచడం వల్ల తాత్కాలికంగా కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫైబర్ తీసుకునే అలవాటుకు గట్ మైక్రోబయోమ్ అలవాటు పడటానికి కొంత సమయం అవసరం. అందువల్ల కూరగాయలను పూర్తిగా మానేయడం కంటే, ఫైబర్ తీసుకునే పరిమాణాన్ని క్రమంగా పెంచడం మంచిది. సలాడ్‌లో ఉపయోగించే డ్రెస్సింగ్‌ను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మార్కెట్లో లభించే కొన్ని బాటిల్ డ్రెస్సింగ్స్‌లో ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, చికోరి రూట్, ఎమల్సిఫైయర్లు, ప్రిజర్వేటివ్‌లు, షుగర్ ఆల్కహాల్స్ వంటి పదార్థాలు ఉంటాయి. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఇవి ఉబ్బరం వంటి సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. డ్రెస్సింగ్‌లో ఉండే కొవ్వు కూడా కడుపు ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, ఎక్కువసేపు కడుపు నిండినట్లు లేదా భారంగా అనిపించేలా చేసే అవకాశం ఉంటుంది.
జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నవారు ఒక్కసారిగా పెద్ద గిన్నె నిండా పచ్చి కూరగాయల సలాడ్ తినడం కంటే, వండిన కూరగాయలతో ప్రారంభించడం మంచిది. ఆవిరిపై ఉడికించడం, స్వల్పంగా వేయించడం, రోస్ట్ చేయడం లేదా తేలికగా ఉడికించడం వంటి పద్ధతుల్లో కూరగాయలను తీసుకోవడం వల్ల వాటి గట్టి మొక్కల నిర్మాణం కొంత మెత్తబడుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ వాటిని సులభంగా నిర్వహిస్తుంది. పచ్చి కూరగాయలను పెద్ద మొత్తంలో ఒకేసారి తినే బదులు, భోజనంలో ఒకటి లేదా రెండు సర్వింగ్స్ వండిన కూరగాయలను చేర్చి, క్రమంగా పరిమాణాన్ని పెంచుకోవాలి. సలాడ్‌ను ప్రధాన భోజనంగా కాకుండా భోజనంలో ఒక భాగంగా తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు అనుకూలమైన సలాడ్ తయారు చేసుకోవాలంటే దాన్ని సింపుల్‌గా ఉంచడం మంచిది. సులభంగా జీర్ణమయ్యే కూరగాయలతో ప్రారంభించి, గ్రిల్డ్ చికెన్, చేపలు, గుడ్లు, టోఫు, పనీర్ లేదా టెంపేతో వంటి మంచి ప్రోటీన్ వనరులను చేర్చుకోవాలి.
ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తగిన పదార్థాలను కూడా కలిపి తీసుకోవడం మంచిది. అవసరమైతే కొద్దిగా అన్నం, క్వినోవా, మిల్లెట్స్, స్వీట్ పొటాటో లేదా సవర్డో వంటి కార్బొహైడ్రేట్ వనరులను కూడా చేర్చుకోవచ్చు. కొన్ని చిన్న మార్పులు కూడా సలాడ్‌ను జీర్ణవ్యవస్థకు మరింత అనుకూలంగా మార్చి తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయలకు బదులుగా స్ప్రింగ్ ఆనియన్ ఆకులను , యాపిల్స్‌కు బదులుగా బెర్రీలను, కాలీఫ్లవర్, పుట్టగొడుగులకు బదులుగా కీరదోస, క్యారెట్, గుమ్మడికాయ, జుక్కిని లేదా రోస్ట్ చేసిన కూరగాయలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రెస్సింగ్‌ను కూడా వీలైనంత సింపుల్‌గా ఉంచి, సలాడ్‌లో పదార్థాలను అతిగా నింపకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శిక్షలా అనిపించకూడదు. ఆరోగ్యకరమైనదని భావించి తినే ఆహారం తిన్న తర్వాత తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించాల్సిన అవసరం లేదు. పెద్ద గిన్నె నిండా సలాడ్ తినడమే ఆరోగ్యకరమైన ఆహారానికి కొలమానం కాదు. మన జీర్ణవ్యవస్థ సౌకర్యవంతంగా జీర్ణించుకోగలిగే విధంగా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ను సమతుల్యంగా కలిపిన భోజనం తీసుకోవడమే అసలు లక్ష్యంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.