శాసనసభ ఎన్నికలు ఆర్టీసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. పోలింగ్ ముందు రోజు నవంబర్ 29నుంచి డిసెంబర్ 1వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోయే వారితో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. దాంతో మూడు రోజుల్లోనే నల్లగొండ రీజియన్‌కు రూ.4,37,22,000 ఆదాయం వచ్చింది. నల్లగొండ డిపో రూ.97.74లక్షల ఆదాయంతో జిల్లా రీజియన్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
నల్లగొండ సిటీ, డిసెంబరు 2 : శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌కు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రూ.4,37, 22,000 ఆదాయం వచ్చింది. ఉద్యోగ, వ్యాపార, బతుదెరువు రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు కుటుంబాలతో సహా ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు తరలివచ్చారు.
వీరిలో సొంత వాహనాలు మినహాయిస్తే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. దీంతో నవంబర్ 29నుంచి డిసెంబర్1వ తేదీ వరకు బస్సులు కిటకిటలాడాయి. ఎక్కువ మంది ముం దుగానే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఎన్నికల సిబ్బంది తరలింపు, ఈవీఎం బాక్సుల తరలింపునకు ఆర్టీసీ బస్సులనే వినియోగించడంతో ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది.
రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో నల్లగొండ డిపో రూ.97.74లక్షల ఆదాయంతో అగ్రస్థానం లో నిలవగా, మిర్యాలగూడ డిపో రూ.76.77లక్షలతో ద్వితీయ, సూర్యాపేట డిపో రూ.72.20లక్షలతో తృతీయ, రూ.67.06లక్షలతో దేవరకొండ నాలుగు, రూ.60లక్షలతో యాదగిరిగుట్ట ఐదో స్థానంలో ఉండగా, రూ.54.11లక్షలతో కోదాడ ఆరో స్థానంలో, 9.33లక్షలతో నార్కట్‌పల్లి డిపో ఆఖరి స్థానంలో నిలిచింది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశాం. ఓటు వేసేందుకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రద్దీని దృష్టిలో పెట్టుకోని చర్యలు తీసుకుంటున్నాం ఆదివారం ఎక్కువ రద్దీ ఉండే పరిస్థితి ఉండడంతో అదనపు బస్సులను నడిపేందుకు ప్రణాళిక చేస్తున్నాం.
– శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం