రుణమాఫీపై నోరు విప్పరే..
ఎన్నికల ముందు రూ.2లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొర్రీల మీద కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థల పాల్జేస్తున్నది. రుణమాఫీ అవ్వని రైతులు తమకు ఎందుకు ప్రభుత్వం లబ్ధి చేకూరలేదో తెలియక ఆగమాగం అవుతున్నారు.
- ఏ సమాచారమూ ఇవ్వని అధికారులు
- అర్హులు, లబ్ధిదారుల వివరాలు లేవంటూ ప్రశ్నల దాటవేత
- ఒకరికి మీదికి ఒకరు తోసేస్తున్న బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు
- తమకు రుణమాఫీ ఎందుకు అవ్వలేదో చెప్పాలంటున్న బాధితులు
సూర్యాపేట, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు రూ.2లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొర్రీల మీద కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థల పాల్జేస్తున్నది. రుణమాఫీ అవ్వని రైతులు తమకు ఎందుకు ప్రభుత్వం లబ్ధి చేకూరలేదో తెలియక ఆగమాగం అవుతున్నారు. నిత్యం వ్యవసాయాధికారుల దగ్గరికి, బ్యాంకుల చుట్టూ విసిగి వేసారుతున్నారు. ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం తొలి విడుత లక్షలోపు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి జిల్లాలో 56,217 మంది రైతులకు 282.98 కోట్లు మాఫీ అయినట్లు చెప్తున్నప్పటికీ ఆస్థాయిలో మాఫీ అయ్యిందా, లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అసలు లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మాఫీ అయింది అనే సమాచారం ఎక్కడా లభించడం లేదు.
రైతులతోపాటు మీడియా ప్రతినిధులు అడిగినా బ్యాంకర్లు గానీ, వ్యవసాయ శాఖ అధికారులు గానీ సమాధానం ఇవ్వడం లేదు. బ్యాంకర్లు తమకు తమకు సంబంధం లేదు.. వ్యవసాయ శాఖ వద్దే ఆ వివరాలు ఉంటాయని చెప్తుండగా, వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్ల మీదకి నెట్టివేస్తున్నారు. రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ విషయంలో ఇంత గుట్టుగా ఉండాల్సిన అవసరమేంటో అధికారులు, ప్రభుత్వానికే తెలియాలి.
కేసీఆర్ సర్కారులో నాడు లక్షలోపు రుణమాఫీ చేయగా సూర్యాపే జిల్లాలో మొత్తం 1,75,000 మంది రైతులు 1,300 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. వారిలో దాదాపు లక్ష మంది రైతులకు రుణాలు మాఫీ చేయగా, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షలు మాఫీ చేయాల్సి ఉండగా.. తొలి విడుతగా లక్ష లోపు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, వారం క్రితం ఈ ప్రక్రియ మొదలు కాగా, జిల్లాలో 2.53 లక్షల మంది రైతులు సుమారు 3,350 కోట్ల రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇందులో 2 లక్షల రూపాయల లోపు తీసుకున్న వారే 90 శాతం మంది ఉన్నట్లు తెలుస్తున్నది. 1.60 లక్షలకు పైన రుణాలు తీసుకోవాలంటే నిబంధనల మేరకు షురిటీలు ఇవ్వాల్సి ఉండడంతోపాటు వడ్డీ రేటు కూడా మారుతుందని, అందుకే రెండు లక్షలు దాటి రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టేంతే ఉంటుందని ఓ బ్యాంకు అధికారి తెలిపారు.
ఈ లెక్కన జిల్లాలో సుమారు 2.35లక్షల మంది రైతులు రెండు లక్షలలోపు రుణాలు తీసుకొని ఉంటారని, అంతా కలిపి 3వేల కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనాగా చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన సమయంలో 1.75 లక్షల మంది రైతులకు 1,300 కోట్లు ఉండ గా, ఇప్పుడు కూడా అంతే మొత్తంలో రుణా లు ఉంటాయన్నది తెలిసిన సమాచారం. తీరా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన లక్షలోపు రుణమాఫీలో సూర్యాపేట జిల్లాలో కేవలం 56,217 మంది రైతులకు 282.98 కోట్లు మాఫీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఎన్నికల ముందు ఎవరైనా రుణాలు తీసుకోకుంటే వెంటనే బ్యాంకులకు వెళ్లి రెండు లక్షలు తీసుకోండి.. మేం వచ్చి మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేడు అనేక కొర్రీలు పెట్టడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకున్న ప్రతి రైతుకూ బ్యాంకులో అకౌంట్ ఉంది.
ఆధార్ కార్డులు అనుసంధానం అయ్యింది. అయినా ఏదో ఒక కొర్రీ పెట్టి రుణమాఫీ చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాని వేలాది మంది రైతు ఐదు రోజులుగా బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రుణమాఫీపై కచ్చితమైన సమాచారాన్ని బహిర్గతం చేసి, మాఫీ కాని రైతులకు సరైన కారణం చెప్పాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఏకకాలంలో రుణమాఫీ ఎటుపోయింది
ఎన్నికలకు ముందు రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదు. ఏకకాలంలో రుణమాఫీ ఎటుపోయిందో రేవంత్‌రెడ్డి సర్కారు రైతులకు సమాధానం చెప్పాలి. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడింది. రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇప్పటికైనా కండ్లు తెరిచి వెంటనే రూ.2లక్షలు రుణమాఫీ చేయాలి.
-నర్ర పరమేశ్, రైతు, సోలిపేట
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

