నల్లగొండ ప్రతినిధి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, సమష్టి కృషితో నల్లగొండ లోక్‌సభ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి కథానాయకులని, వారి అవిరళ కృషితోనే పార్టీ క్షేత్ర స్థాయిలో ఇన్నాళ్లు బలంగా ఉన్నదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
లోక్‌సభ నియోజకవర్గ నలుమూలల నుంచి అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ రానున్న ఎంపీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్న పార్టీ శ్రేణులంతా మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోని లోటుపాట్లను విశ్లేషించుకుంటూ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా అనిపించినా ఫలితాలు మరోలా వచ్చాయని గుర్తు చేశారు.
ఓటమి ఎదురవుతుందన్నట్లుగా ఎక్కడా అనుమానం రాలేదన్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయంటూ పార్టీకి, ప్రభుత్వానికి మరింత సమన్వయం అవసరమన్న భావనతో కార్యకర్తలు ఉన్నట్లు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పార్టీ పట్ల జరుగుతున్న అసత్య ప్రచారంపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
లోక్‌సభ సమీక్షా సమావేశాల మాదిరిగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చిందని, వాటి అమలుపై ప్రజల్లోకి వెళ్దామని సూచించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న సానుభూతిని లోక్‌సభ ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నవంబర్ నెల నుంచే కరెంటు బిల్లులు కట్టవద్దని ప్రజలకు చెప్పారని గుర్తు చేస్తూ నల్లగొండ ప్రజలంతా తమ బిల్లులను కోమటిరెడ్డి ఇంటికి పంపాలని చెప్పారు. కాంగ్రెస్ నేతల హామీలపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తూ చైతన్యం చేయాలన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుందని విమర్శించారు. ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించి తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెడుతున్నదని ఆరోపించారు. నల్లగొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం సాక్షిగా కాంగ్రెస్, బీజేపీల అక్రమ బంధం బయటపడిందని గుర్తు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ను ముక్కలు చేస్తానని ప్రగల్భాలు పలుకడం మానుకుని రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సూచించారు. కృష్ణా ఆయకట్టుకు అన్యాయం చేసేలా ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం సంతకం పెట్టిందని ఆరోపించారు. ఇలా సంతకం పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డిని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీయాలన్నారు. నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీటి అవసరాలపై కోమటిరెడ్డి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చామని గుర్తు చేశారు.
ప్రస్తుత యాసంగి సీజన్లో కాళేశ్వరం జలాలు వాడుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే లేదని విమర్శించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అనేక సూచనలు వచ్చాయంటూ కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, త్వరలోనే కమిటీలు వేసుకుందామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 హామీలను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పలువురు ముఖ్య నాయకులు మాట్లాడారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్‌కుమార్, నాయకులు రాంచంద్రనాయక్, తిప్పన విజయసింహారెడ్డి, తేరా చిన్నపరెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, చెరుకు సుధాకర్, మాలె శరణ్యారెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్, గుత్తా అమిత్‌కుమార్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, వడ్త్యా రమేశ్‌నాయక్, కడారి అంజయ్యయాదవ్, నిరంజన్‌వలీ, గోపగాని వెంకట్‌నారాయణగౌడ్ పాల్గొన్నారు.