Obsession Movie | హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక చిన్న బడ్జెట్ హర్రర్ చిత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రముఖ యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ (OBSESSION) ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 950 కోట్లకు పైగా) మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 100,000 డాలర్ల (సుమారు రూ. 9 కోట్లు) అత్యల్ప నిర్మాణ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన బడ్జెట్ కంటే ఏకంగా 125 రెట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. మైఖేల్, ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 వంటి భారీ బడ్జెట్ స్టార్ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.
ఒక చిన్ననాటి బొమ్మ ద్వారా కోరుకున్న కోరిక ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీసిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. కేవలం ఒక కార్, ఒక ఇల్లు, మరికొన్ని పరిమిత వనరులతోనే దర్శకుడు ఈ విజువల్ వండర్‌ను స్క్రీన్ మీద ఆవిష్కరించారు. 2009లో వచ్చిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ తర్వాత ఇంత తక్కువ బడ్జెట్‌తో వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఏకైక చిత్రంగా ‘అబ్సెషన్’ నిలిచింది. బలమైన మౌత్ టాక్, విమర్శకుల నుండి లభించిన అద్భుతమైన రేటింగ్స్ కారణంగా ఈ హర్రర్ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతోంది.