– బడుగు బిడ్డ కనుకనే సీఐని సస్పెండ్ చేశారు
– కేసు నీరుగార్చేందుకు కుట్ర
– పెదవి విప్పని అధికార పార్టీ నేతలు
– ఇక రోడ్డెక్కి తేల్చుకుంటాం
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
కోదాడ, డిసెంబర్ 20 : దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డితో పాటు సంబంధిత అధికారుల అందరిపై చట్టపరంగా, శాఖపరమైన చర్యలు తీసుకోవడమే తమ ప్రధానమైన డిమాండ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిలుకూరు ఎస్ఐ బలమైన సామాజిక వర్గం కావడం వల్లే కేవలం ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేసి బీసీ అయిన రూరల్ సీఐపై సస్పెండ్ వేటు వేశారని విమర్శించారు. రాజేశ్ కేసులో తాము కులాలు, మతాలకు అతీతంగా డీజీపీకి, ఎస్సీ కమిషన్కు కేసులో తమ వాళ్లు ఉన్నా చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఎస్కార్ట్ వచ్చిన వారిపై కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఎవరూ లేనట్టుగా ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తితో పోస్టుమార్టం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అదే రోజు రాత్రి చిలుకూరు ఎస్ఐ పోస్టుమార్టం చేసిన డాక్టర్ను ఎందుకు కలిశారో, పోస్టుమార్టం వీడియోను చిత్రీకరించేందుకు హైదరాబాద్ నగరంలో ఎవరూ లేనట్టుగా కోదాడ పట్టణానికి చెందిన వీడియో గ్రాఫర్తో ఎందుకు వీడియో తీయించారని ఆయన ప్రశ్నించారు. ఆదిపత్య సామాజిక వర్గం కలిసి ఒక దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హత్య కేసులో అధికార పార్టీ నేతలు పెదవి విప్పకపోవడం దురదృష్టకరమన్నారు. దళిత బిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. వారు రేపు మాదిగ వాడల్లో, పల్లెల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మాదిగ జాతి భవిష్యత్, అస్తిత్వమే తమకు ముఖ్యమని, దీనిపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. లాకప్ డెత్ కేసులో బాధ్యులైన వారందరిపై హత్యా నేరం మోపి 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సర్వీస్ నుండి పూర్తిగా తొలగించాలన్నారు. లేనిపక్షంలో తాము ఇప్పటి వరకు శాంతియుతంగా నిరసన తెలిపామని, ఇకపై రోడ్డు ఎక్కి తాడోపేడో తేల్చుకుంటామని మందకృష్ణ హెచ్చరించారు.