చిట్యాల, జూన్ 8: మండలంలోని ఉరుమడ్లలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మహా కుంభాభిషేకం, పూర్ణాహుతిని వేదపండితుల మంత్రోచ్ఛారణాలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు పార్వతీరామలింగేశ్వర స్వామికి బోనాలు సమర్పించారు. కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలను చెన్నై, తెలంగాణ నుంచి వచ్చిన 51మంది రుత్వికుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల చివరిరోజు పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం, గ్రామ దేవతలకు బోనాలు, సాయంత్రం పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కల్యాణం జరిగాయి.
మృగశిర కార్తె కూడా కలిసి రావడంతో గ్రామంలోని ప్రతి ఒక కుటుంబం బంధువులను పిలుచుకుని వేడుకలు చేసుకున్నారు. ఊరంతా బంధువులు, మిత్రులతో సందడిగా కనిపించింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమ భరత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ మాజీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు నలగాటి ప్రసన్నరాజ్, చకిలం అనిల్ కుమార్, వెంకటేశ్వరు,్ల గోలి అమరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్‌లతోపాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రాజకీయాలకతీతంగా పాల్గొన్నారు.