నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్16(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఇస్తామని చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు రాజకీయాలకు అతీతంగా అర్హులైన సామాన్యులకు దక్కడంపై ఆదిలోనే అనుమానాలు మొదలయ్యాయి. లబ్ధిదారుల ఎంపికలో కీలకమంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటు పూర్తిగా కాంగ్రెస్ నేతల కనుసన్నుల్లో జరుగుతున్నది. గ్రామాలు, వార్డుల వారీగా కాంగ్రెస్ నేతలు సూచిస్తున్న వారినే సభ్యులుగా ఎంపిక చేస్తున్నారు. గ్రామ కమిటీల్లో కీలకమైన చైర్మన్, కన్వీనర్లుగా అధికారులు ఉండగా.. వారికి తెలియకుండానే కమిటీ సభ్యులను ఎంపిక చేస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.
పూర్తిగా కాంగ్రెస్ నేతలు కూర్చుని గ్రామాల వారీగా జాబితాలను అందజేస్తే వాటికి ఆయా ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో తుది రూపం ఇస్తుండడం గమనార్హం. ఫైనల్‌గా ఎమ్మెల్యేలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక జాబితాలు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా కలెక్టర్లకు చేరుతున్నాయి. కాగా, మూడు రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుగుతున్న కమిటీల ఎంపిక ప్రక్రియపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఎంపిక తీరును చూసి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకే పరిమితం అవుతాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల కమిటీల ఎంపికపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అవుతుండగా, ఉన్నట్టుండి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను ఒక్క రోజు తేడాతోనే పూర్తి చేయాలని ఈ నెల 11న ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. తెల్లారితే శనివారం.. అదీ దసరా రోజే తుది జాబితాలు అందజేయాలని పేర్కొంది. ఇంత అర్జెంట్‌గా కమిటీలు ఎలా అని అప్పుడే అధికారులు తలలు పట్టుకున్నారు. ఒకవేళ అదనపు శ్రమతో పూర్తి చేద్దామన్నా తమ చేతిలో ఏమీ లేదు. కమిటీలను నామినేట్ చేసే అధికారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
కమిటీల జాబితాలన్నింటినీ తామే సిద్ధం చేసి అందజేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. దాంతో అధికారులు ఎమ్మెల్యేలు, వారి పీఏలను తుది జాబితాల కోసం బతిమిలాడాల్సి వస్తున్నది. నల్లగొండ కలెక్టర్ మంగళవారమే కమిటీల ఎంపిక పూర్తి కావాలని కింది స్థాయి అధికారులకు డెడ్‌లైన్ విధించినా ఫలితం లేకపోయింది. గ్రామాల వారీగా జాబితాలు తుది దశకు వచ్చినా వాటికి స్థానిక ఎమ్మెల్యేలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. దాంతో ఒకటి, రెండ్రోజులు సమయం పట్టవచ్చని తెలుస్తున్నది.
చైర్మన్, కన్వీనర్లకు తెలియకుండానే…
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి గ్రామ లేదా మున్సిపల్ వార్డు కమిటీలో ఏడుగురు సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే కమిటీకి సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా, ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామాభివృద్ధిలో కీలకమైన మరో ముగ్గురిని సభ్యులుగా నియమించవచ్చు. ఈ ముగ్గురిలోనూ ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్టీ తప్పనిసరి చేశారు. గ్రామాల్లో కమిటీలకు సర్పంచ్‌లు లేకపోవడంతో స్పెషల్ ఆఫీసరే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. మెజార్టీ గ్రామాల్లో వారితో సంబంధం లేకుండా మిగతా ఐదుగురు సభ్యులను కాంగ్రెస్ నేతలే ఎంపిక చేశారు.
ఎక్కువ చోట్ల మండలాల వారీగా కాంగ్రెస్ నేతలు కూర్చుని కమిటీల కూర్పును పూర్తి చేస్తున్నారు. దాంతో ఆయా గ్రామాల వారీగా కాంగ్రెస్ నేతలే ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. ఇలా నియమించిన కమిటీల జాబితాను నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో అందజేశారు. అక్కడ ప్రస్తుతం కమిటీలకు తుది రూపం ఇస్తున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విబేధాలతో ఏకాభిప్రాయం రాలేదని, అలాంటి వాటిపై ఎమ్మెల్యేలు తుది నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తున్నది. ఆ తర్వాతే ఆ కమిటీల తుది జాబితాలను తిరిగి మండలాల్లో ఎంపీడీఓలకు, పట్టణాల్లో కమిషనర్లకు కాంగ్రెస్ నేతలు అందజేస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి జాబితాలను కలెక్టర్ పంపి, ఫైనల్‌గా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో తుది కమిటీలను వెల్లడించనున్నారు.
కమిటీలదే కీలక పాత్ర
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఈ కమిటీలదే కీలక పాత్ర కానుంది. కమిటీ ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక మొదలు అవగాహన కార్యక్రమాలు, ఇండ్ల నిర్మాణంలో సలహాలు, సూచనలు, ఫైనల్‌గా సోషల్ ఆడిట్‌ను కూడా కమిటీలే పర్యవేక్షిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులకు ఇండ్లు దక్కకపోవడం, అనర్హులకు ఇండ్లు వస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కమిటీలపై ఉంది. కానీ ఎంపిక దశలోనే కమిటీల్లో పారదర్శకత లోపించడంతో ఎంతవరకు కమిటీల లక్ష్యం నెరవేరుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. కమిటీల్లో కాంగ్రెస్ నేతలే కీలకం కావడంతో ఇండ్లను కూడా వారి కార్యకర్తలకే వచ్చేలా చూస్తారన్నది నిజం.
దాంతో నిజమైన అర్హులకు ఇండ్లు దక్కుతాయా, లేదా అన్నది అనుమానంగా ఉంది. దీనివల్ల అర్హులు ఈ పథకానికి దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ కక్షతో అర్హులైన ఇతర పార్టీల్లోని పేదలకు, ఎవరితోనూ సంబంధం లేని సామాన్యులకు ఇండ్లను దక్కనిస్తారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుపై గ్రామాల్లో విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఏకపక్ష జాబితాలపై విపక్ష నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. పారదర్శకత లేకుండా ఎంపిక చేస్తున్న కమిటీలతో అర్హులకు న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ.5లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమంలో వివిద పథకాలతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులను స్వీకరించింది. ఇండ్ల నిర్మాణం కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటారా, లేదా కొత్తగా స్వీకరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత ఏడాదికి నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 48వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం రానున్నాయి.