యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2022 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నూకల ఉమాహారతి సత్తా చాటారు. ఆలిండియా లెవల్లో 3వ ర్యాంకు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే టాప్‌లో నిలిచారు. ఉమాహారతి హుజూర్నగర్ పట్టణానికి చెందిన నూకల వెంకటేశ్వర్లు కూతురు. ప్రస్తుతం ఆయన నారాయణపేట ఎస్పీగా పని చేస్తున్నారు. బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి మంచి ప్లేస్ మెంట్ వచ్చినా ఐఏఎస్ అవ్వాలన్న తండ్రి కల నెరవేర్చేందుకు ఉమాహారతి సివిల్స్ వైపు మళ్లారు. నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమైనా కలత చెందక మరింత పట్టుదలతో ముందును సాగి విజయం సాధించారు. ప్రతి ఒటమినీ గెలుపునకు నాందిగా మార్చుకున్నట్లు ఆమె తెలిపారు. ఉమాహారతి సోదరుడు సాయివికాస్ కూడా ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)లో ఆలిండియా 12వ ర్యాంక్ సాధించి, సోమవారమే ఉద్యోగంలో చేరడం విశేషం.
హుజూర్నగర్/నారాయణపేట, మే 23 : తన లక్ష్యం సివిల్ సర్వీసెస్. నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమైనా కలత చెందకుండా ధైర్యంతో ముందడుగు వేసి ఐదోసారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి. ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి అందరిచే శభాశ్ అనిపించుకున్నది. ప్రతి ఓటమిని గెలుపునకు నాందిగా మార్చుకొని విజయం సాధించినట్లు యువ కలెక్టర్ చెప్పింది. అయితే ర్యాంక్ సాధించిన ఉమాహారతికి ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీస్ అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
వృత్తిరీత్యా తండ్రి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ విద్యాభ్యాసం చేస్తూ వచ్చింది ఉమాహారతి. 6 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్‌లోని భారతి విద్యా భవన్లో, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్, బీటెక్ సివిల్ ఇంజినీర్ హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది. ప్లేస్మెంట్ వచ్చినప్పటికీ ఐఏఎస్ కావాలన్న తన తండ్రి ఆశయాన్ని, తన చిన్ననాటి కలను నేరవేర్చుకునేందుకు ఉద్యోగం చేయకుండా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ వచ్చింది. ముందుగా ఢిల్లీలోని ప్రముఖ వాజీరాం ఇన్స్ట్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ అక్కడ ఉండి చదువుకోవాల్సిన అవసరం లేదని, ఇంటి దగ్గర ఉండి చదువుకోవచ్చని భావించిన ఆమె ఇది వరకు తన తండ్రి మహబూబ్‌నగర్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో అక్కడ, తిరిగి నారాయణపేట ఎస్పీగా పని చేస్తుండడంతో గతేడాది ఏడాది కాలంగా నారాయణపేటలోనే తన తండ్రి వద్ద ఉంటూ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యింది. గతంలో నాలుగు సార్లు పరీక్ష రాసినా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడంతో ఎంపిక కాలేకపోయింది. ఐదోసారి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్‌తో పరీక్ష రాయగా.. మంచి ర్యాంకు వచ్చింది. తన తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుకు కూతురుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని, తన సోదరుడు సాయివికాస్ కూడా యూపీఎస్‌స్సీ-2022లో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(ఐఈఎస్)లో ఆలిండియా స్థాయిలో 12వ ర్యాంక్ సాధించి, సోమవారమే ముంబాయిలో ఉద్యోగంలో చేరాడు. ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు ఫోన్లో, నేరుగా అభినందనలు తెలిపారు.
అనంతగిరి : అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన గ్రందె సాయికృష్ణ మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 293వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాడు. సాయికృష్ణ ప్రాథమిక అభ్యాసం గ్రామంలోనే పూర్తయ్యింది. అనంతరం ఖమ్మంలో విద్యను అభ్యసించాడు. కేరళ రాష్ట్రంలో బీటెక్ పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటూ సివిల్స్‌కు ప్రిపేరై విజయం సాధించాడు. ఆయన తల్లి నాగలక్ష్మి, తండ్రి శ్రీనివాస్‌రావు కొత్తగూడెంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన సాయికృష్ణ సివిల్స్ ర్యాంక్ సాధించడంపై ఆయన బంధువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.