పెన్పహాడ్, డిసెంబర్ 26 : వీధి కుక్కలు చేసిన దాడిలో నాలుగేండ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన గద్దల వెన్నెల(4) అనే బాలికపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుక్కల దాడిలో బాలిక మూతికి తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు కుక్కను వెంబడించడంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స కోసం బాలికను వెంటనే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు.