నకిరేకల్, డిసెంబర్ 15 : నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు మహర్దశ పట్టనుంది. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన రోడ్డు విస్తరణ పనులు సెంట్రల్ లైటింగ్, డివైడర్ల పనులకు ఇటీవల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. దాంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది.
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా దాదాపు 40 వేలకు పైగా జనాభా ఉంది. నియోజకవర్గ కేంద్రం కావడంతో చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చి చాలామంది నకిరేకల్‌లో స్థిర పడుతుండడంతో జనాభా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నకిరేకల్ పట్టణ రోడ్ల విస్తరణ అనివార్యమైంది. తొలివిడుతగా నకిరేకల్ బైపాస్‌లోని పద్మా నగర్ నుంచి ఇనుపాముల జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు గతంలోనే రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిధులు విడుదల కావడంతో పనులు చకచకా సాగుతున్నాయి.
నకిరేకల్ బైపాస్ వద్ద పద్మానగర్ నుంచి ఇనుపపాముల జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణంతో పాటు రెండు వైపులా మురుగు కాల్వ నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఏర్పాటు చేసి అనంతరం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటుచేయనున్నారు. డివైడర్‌కు ఇరువైపులా 50 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ జరగనుంది 6 ఫీట్ల వెడల్పుతో మురుగు కాల్వ నిర్మించనున్నారు. అలాగే రెండో విడుతలో తిప్పర్తి రోడ్డు, మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
మా కాలనీలో ఇప్పటికే సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించారు. మెయిన్‌రోడ్డుపై ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటున్నాయి. రోడ్లు వెడల్పు అయితే ఇక ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. నకిరేకల్‌లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం సంతోషంగా ఉంది.
– కిన్నెర లక్ష్మీప్రియ, డాక్టర్స్ కాలనీ
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో తొలివిడుత రోడ్డు విస్తరణ పనులకు రూ.26 కోట్ల నిధులు మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. తిప్పర్తి, కడపర్తి రోడ్డు పనులకు నిధులు విడుదల చేయించాలని ఎమ్మెల్యేను కోరా. పనులు పూర్తయితే పట్టణ రూపు రేఖలు మారుతాయి.
– రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్