సూర్యాపేటటౌన్, జూన్ 10: గడ్డి మందులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చేవని చెబుతూ రైతులను మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ 65లక్షల విలువైన 22క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ నెల 9న ఉదయం ఆత్మకూర్.ఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద సీసీఎస్, ఆత్మకూర్.ఎస్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన తండా నగేష్ 120ప్యాకెట్ల నకిలీ విత్తనాల గోనె సంచిని బండిపై పెట్టుకుని వెళుతుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన పంది రాములు వద్ద విత్తనాలు తెస్తున్నట్లు అంగీకరించాడు.
ఈ విత్తనాలు గడ్డి మందు తట్టుకునేదని అధిక దిగుబడిని ఇచ్చేదని చెప్పి రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించి నగేష్‌తో పాటు పంది రాములు, నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చెందిన విత్తన దుకాణాదారు బానోత్ జయరాం, గుంటూరు బాలాజీనగర్‌కు చెందిన తరిగొప్పుల శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. జయరాం షాపులో నిల్వ చేసిన 37బస్తాల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ. 63లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నకిలీ విత్తనాలను జిల్లా మొత్తం విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని రైతులకు నకిలీ విత్తనాలు చేరకుండా చేశామన్నారు. ఈ కేసులో బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన మాగులూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పల్లిపాడుకు చెందిన చెవుల నర్సింహులు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుడు సాంబశివరావు ఎండీగా వ్యవహరిస్తూ అరుణోదయ అనే విత్తన కంపెనీ నిర్వహిస్తూ నకిలీ విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించామని వీరిని త్వరలోనే అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తామన్నారు.
అలాగే మోతె మండలం రావిపహాడ్‌లో వెలుగు శ్రీను నివాసంలో అడ్వాన్స్ 333, అరుణోదయ కంపెనీ పేర్లతో ఉన్న 98 నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి సీజ్ చేశామన్నారు. నిందితున్ని విచారించగా తనకు బంధువైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహనతో కలిసి మోతె మం డల, పరిసర గ్రామాల్లో, జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఈ విత్తనాలు గడ్డి మందును తట్టుకునేవని అధిక దిగుబడి ఇచ్చే మంచిరకం పత్తి విత్తనాలు అని నమ్మంచి ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నానని తెలిపాడు. దీంతో నిందితుడు వెలుగు శ్రీను ను అరెస్టు చేసి రూ. 2లక్షల విలువైన 58కిలోల నకిలీ విత్తనాలు సీజ్ చేశామన్నారు.
వీరికి విత్తనాలు సరఫరా చేస్తున్న నిందితుడు తిరుమల్ కర్ణాటక రాష్ట్రం నలుగునూర్ అని నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులు నకిలీ విత్తనాల గుర్తించి అప్రమత్తంగా ఉండాలని విడి విత్తనాలతో అధిక ప్రమాదమని గమనించాలన్నారు. ఎవరైనా మధ్యవర్తులు విత్తనాలు అమ్ముతున్నామంటే నమ్మి కొనుగోలు చేయవద్దని నమ్మకమైన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయడం మేలని కంపెనీ విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని అవసరమైతే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసిన కేసుల్లో బాగా పని చేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్‌రావు, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, కరుణాకర్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేశ్, సతీశ్, శివకృష్ణ, ప్రభాకర్, మహిళా హోంగార్డు మంజుల, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఆత్మకూర్.ఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మోతె ఎస్ఐ యాదవేందర్, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, సూ ర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ ఉన్నారు.