కట్టంగూర్, ఆగస్టు 08 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వారు ఈత మొక్కలను నాటి, గీత కార్మికులకు 2 వేల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాటిన ఈత మొక్కలను ఎండిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మండలంలో 5 వేల మొక్కల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వన మహోత్సవ కార్యక్రమంలో గీత కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో పాటు ఈత వనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రెండు రోజుల పాటు ఈత మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కడెం రాంమోహన్, ఈసీ వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్ దాసరి యాదగిరి, ఎక్సైజ్ సిబ్బంది జావిద్, సైదులు, గీత కార్మికులు, గౌడ సంఘం సోసైటీ సభ్యులు పాల్గొన్నారు.