నేరేడుచర్ల, జూన్ 14 : బస్సులో సెల్‌ఫోన్, పర్సు మరిచిపోయిన ప్రయాణీకురాలి వస్తువులను కండక్టర్ అప్పగించి నిజాయితీ
చాటుకున్నాడు. ఈ నెల 13వ తేదీన నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి చెందిన ప్రయాణీకురాలు భీమవరపు మౌనిక కోదాడ డిపోకు చెందిన బస్సులో మిర్యాలగూడ నుంచి చిల్లేపల్లికి వచ్చింది. చిల్లేపల్లిలో బస్ దిగి వెళ్లిపోయింది. ఆమె కూర్చున్న సీటులో పర్సు, సెల్ ఫోన్ మర్చిపోవడంతో కండక్టర్ బి.వెంకటేశ్వర్లు (ఇ175554) వాటిని గుర్తించి తన వద్ద ఉంచుకున్నాడు. సెల్ ఫోన్ ద్వారా యువతికి సమాచారం అందించి మిర్యాలగూడలోని విచారణ కేంద్రం వద్ద పర్సులో ఉన్న రూ.1,320 నగదు, సెల్ ఫోన్‌ను అప్పగించాడు. ఈ సందర్భంగా కండక్టర్‌కు పలువురు అభినందనలు తెలిపారు. మౌనిక ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.