పెద్దఅడిశర్లపల్లి, సెప్టెంబర్ 27 : ఏఎమ్మార్పీ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి సిస్టర్న్ ప్యారపిట్వాల్ (పిట్టగోడ) గురువారం రాత్రి కూలింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న గోడ మట్టి కుంగి 1వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల మేరకు కూలి లోపలి భాగంలో పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలేనని తెలుస్తున్నది. గతంలో సిస్టర్న్ నిర్మాణం నాటి నుంచి సిపేజీ(జాలునీరు) లీకేజీ కావడంతో పాటు ఇంటెక్స్ స్ట్రెక్చర్ వద్ద మట్టి కట్ట కుంగింది.
అప్పట్లో ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తక్షణమే నిపుణుల నివేదిక మేరకు రూ.2కోట్లతో ఇంటెక్ స్ట్రెక్చర్ గ్రౌండింగ్ చేపట్టి మట్టి కట్టకు జేపీ కంపెనీ నిపుణులతో ర్యాక్ ఫిల్‌డ్యామ్ నిర్మించారు. దీంతో కొద్ది రోజుల పాటు ఏఎమ్మార్పీ మూడు మోటార్లే నడుపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్యారపిట్ వాల్ కూలడంతో ఇరిగేషన్ అధికారులు తాత్కాలిక చర్యలకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఈ అజయ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కూలిన ప్రదేశంలో సిమెంట్ బస్తాలను అడ్డుగా వేసి మట్టి కట్ట కూలకుండా తాత్కాలిక మరమ్మతులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఈఈ సత్యనారాయణ, డీఈ నాగయ్య, జేఈ శ్రావణ్ ఉన్నారు.